
- కొందరి చేతుల్లోనే రాష్ట్రం బందీ
- 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు పీకే ఎందుకు..?
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అభినందన సభ
హైదరాబాద్, వెలుగు : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయ్యిందని, ప్రగతి భవన్గోడలు బద్దలు కొట్టి తమ పార్టీ జెండా ఎగురవేసే రోజులు దగ్గరలో ఉన్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) స్టేట్ ప్రెసిడెంట్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అభినందన సభ నిర్వహించారు. అంతకుముందు ఎంపీ, ఆ పార్టీ స్టేట్ ఇన్‌చార్జీ రామ్‌జీ గౌతమ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. 70వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ పీకేను ఎందుకు తెచ్చుకున్నారో అర్థం కావడం లేదని, సీఎంకి బీఎస్పీ భయం పట్టుకుందని విమర్శించారు. దొరల పాలనలో దోపిడీ పెరిగిపోయిందన్నారు. తమ పార్టీని చూసి బండి సంజయ్‌కు కూడా నిద్ర పట్టడం లేదన్నారు. కేసీఆర్ పాపాలు చెబితే టైం సరిపోదని, తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద పైసల్లేవని, కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడుతున్నారన్నారు. అన్ని పార్టీల్లో అగ్రవర్ణాల వారినే అందలమెక్కిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బీసీలకు 70 సీట్లు
ఇస్తామన్నారు.
జనం గోడు చూస్తే ఏడుపొచ్చింది..
రాజ్యాధికార యాత్రలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల కష్టాలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. బెల్ట్ షాపుల వల్ల చిన్న వయసులోనే వితంతువులుగా మారిన గిరిజన స్త్రీలను కలిస్తే ఏడుపొచ్చిందన్నారు. రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల పాట్లు, కార్మికుల కన్నీళ్లు కదిలించాయని తెలిపారు. మన పిల్లలు చదువుకోసం బిచ్చమెత్తుకుంటే.. నేతలు విందులు వినోదాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ టూర్, కేటీఆర్ ఫారిన్ విజిట్లతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందన్నారు. రెడ్లే.. రాష్ర్టాన్ని పాలించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారని, వారు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనడం ఇతర కులాలను తక్కువ చేయడమే అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 70 నుంచి 80 మంది గెలిచి ప్రగతి భవన్‌కు వెళ్లాలన్నారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే ఏనుగు గుర్తుకు ఓటేయాలని, ప్రగతి భవన్‌లో బీఎస్పీ జెండా ఎగరాలన్నారు.
ఉచిత విద్య, వైద్యం: రామ్‌జీ గౌతమ్
రాష్ట్రంలో అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారని, ఈ ఒక్కసారి బీఎస్పీకి ఛాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ స్టేట్ ఇన్‌చార్జీ రామ్‌జీ గౌతమ్ కోరారు. అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, రాష్ట్రాన్ని గాడిన పెట్టే సత్తా ప్రవీణ్ కుమార్‌కు మాత్రమే ఉందన్నారు.