
- 2.50 లక్షల ఎకరాలకు నీరందించేలా కృషి
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)తయారు చేసేందుకు రూ.1.10 కోట్లు మంజూరు చేసినట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంతర్గాం వద్ద రూ.75 కోట్లతో నిర్మించిన రామగుండం ఎత్తిపోతల పథకాన్ని మంత్రి ప్రారంభించారు. పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన 1127 స్వశక్తి సంఘాలకు రూ.1.23 కోట్ల వడ్డీ రాయితీ చెక్కులు, 10 సంఘాల సభ్యులకు రూ.14.91 లక్షల స్త్రీనిధి లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులు, 257 స్వశక్తి సంఘాలకు రూ.19 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందించారు.
రూ.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గాం ఎమ్మార్వో ఆఫీసు, రామగుండం బీ- పవర్ హౌస్ నుంచి రైల్వే క్రాసింగ్ వరకు రూ.10 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు, రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందిరా మహిళా శక్తి కింద ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల పరిధిలో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరుందించేలా 3 నుంచి 5 టీఎంసీల నీటిని నిల్వ సామర్ధ్యంతో పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్‌కుమార్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్‌రావు మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు వారు చెప్పారు. రైతులకు ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. రామగుండం ప్రాంతంలో ఇప్పటికే అనేక పరిశ్రమలు ఉన్నాయని, ప్రైవేట్ పరిశ్రమల ఏర్పాటుకోసం పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేస్తామన్నారు.
సింగరేణి భూమిని రెగ్యులరైజేషన్ చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మించాలని, 40 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో అదనపు గోడౌన్లు మంజూరు చేయాలని కోరారు. మినిమమ్ వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి.జనక్ ప్రసాద్, సివిల్ సప్లై ఎండీ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.