భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదనే అదనపు టారిఫ్‌‌‌‌లు.. అమెరికాపై ఆర్ఎస్ఎస్ చీఫ్విమర్శలు

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదనే  అదనపు టారిఫ్‌‌‌‌లు.. అమెరికాపై ఆర్ఎస్ఎస్ చీఫ్విమర్శలు
  • మన ప్రగతిని కొందరు ఓర్చుకోవడం లేదు
  • నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో బ్రహ్మకుమారీల కార్యక్రమానికి హాజరు

నాగ్‌‌‌‌పూర్: భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందడం చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని, ఆ ఆందోళనతోనే దేశ దిగుమతులపై అదనపు సుంకాలు విధించారని ఆర్ఎస్‌‌‌‌ఎస్​ చీఫ్​ మోహన్ భాగవత్‌‌‌‌ విమర్శించారు. వాణిజ్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా జరగాలని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.  భారత్‌‌‌‌పై 50% టారిఫ్‌‌‌‌లు విధించిన అమెరికా పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. 

శుక్రవారం (సెప్టెంబర్ 12) నాగ్‌‌‌‌పూర్​లో నిర్వహించిన బ్రహ్మకుమారీల కార్యక్రమానికి మోహన్​ భాగవత్‌‌‌‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ‘‘ఇండియా అభివృద్ధి చెందితే ఏమవుతుంది?..అందుకే సుంకాలు విధిస్తారా? సప్త సముద్రాల ఆవల ఉన్న మీరు ‘నీది.. నాది’ అనే అభద్రతా భావంతో భయపడుతున్నారు. నేడు ప్రపంచం పరిష్కారాన్ని కోరుకుంటున్నది. అయితే, వారు అసంపూర్ణ దృష్టితో పరిష్కారం కనుక్కోవాలని ప్రయత్నించారు. అందుకే పరిష్కారం లభించలేదు” అని అమెరికాకు పరోక్షంగా చురకలంటించారు.

ఒత్తిడి లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం ఉండాలి

అంతర్జాతీయ వాణిజ్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ, స్వచ్ఛంద సహకారంపై ఆధారపడి ఉండాలని మోహన్​ భాగవత్​ తెలిపారు. ‘‘ఆత్మనిర్భర్​ అంటే దిగుమతులను ఆపడం కాదు.. ప్రపంచం పరస్పర ఆధారంతో నడుస్తున్నందువల్ల ఎగుమతులు.. దిగుమతులు కొనసాగాల్సిందే. కానీ.. వాటిలో ఎలాంటి ఒత్తిడి ఉండొద్దు” అని వ్యాఖ్యానించారు. 

అందరూ దేవుని పిల్లలమే అని అనుకుంటే అభద్రతా భావం అనేదే ఉండదని తెలిపారు. ‘‘మనలో శత్రుత్వం లేకపోతే ఎవరూ శత్రువులు కారు.. గతంలో పాములను చూస్తే మనం భయపడేవాళ్లం. కానీ, జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని పాములూ విషపూరితం కాదని తెలుసుకుని  వాటిని అలాగే వదలిపెట్టడం మొదలుపెట్టాం.. జ్ఞానం వల్ల భయం, వివక్ష అన్నీ తొలగిపోయాయి’’ అని భాగవత్  పేర్కొన్నారు.