ఆటో షోరూమ్ల తనిఖీ షురూ..అమ్మకాల్లో దోపిడీ ఆరోపణలతో రంగంలోకి రెవెన్యూ, ఆర్టీఏ

ఆటో షోరూమ్ల తనిఖీ షురూ..అమ్మకాల్లో దోపిడీ ఆరోపణలతో రంగంలోకి రెవెన్యూ, ఆర్టీఏ
  • షోరూమ్స్​లో ఆటోల లభ్యత, ధరల డిస్​ప్లేకు ఆదేశాలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: రూల్స్​కు విరుద్ధంగా కొందరు షోరూమ్​ల నిర్వాహకులు ఆటోల ధరలు పెంచి దోచుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో  రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా షోరూమ్స్​కు వెళ్లి ఆటోల బుకింగ్​వివరాలు, వసూలు చేస్తున్న ధరల గురించి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతి షోరూంలో ఆటో అమ్మే ధరతో పాటు స్టాక్ వివరాలను డిస్​ప్లే చేయాలని ఆదేశించినట్టు ఆర్టీఏ జేటీసీ రమేశ్​కుమార్​తెలిపారు. ఎక్కువ ధరలు వసూలు చేస్తున్న వారిపై  ఫిర్యాదు వస్తే  చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

వెబ్​సైట్​లాగిన్​ ఫెసిలిటీ అందరికీ కల్పించాలి

ఆటోల కోసం షోరూమ్స్​కు వెళ్లడం వల్లే దోపిడీకి గురవుతున్నామని ఆటో డ్రైవర్ల సంఘం లీడర్లు ఆరోపిస్తున్నారు. వెబ్​సైట్​లో లాగిన్​ అయ్యే అవకాశం కేవలం షోరూమ్స్​కే ఇచ్చారని, ఆటో కావాలనుకున్న వారందరికీ లాగిన్​అవకాశం ఇవ్వాలని, దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉండదని తెలంగాణ ఆటోఅండ్​ట్యాక్సీ డ్రైవర్స్​యూనియన్​అధ్యక్షుడు సీహెచ్​నందకిషోర్​, ప్రధాన కార్యదర్శి బి.పెంటయ్యగౌడ్​ డిమాండ్​చేశారు. ఇప్పటి వరకు ఆటో లాగిన్ వివరాలను పూర్తిగా పరిశీలించాలని, బినామీ పేర్లపై కొందరు ఫైనాన్షియర్లు ఆటోలను బ్లాక్ చేసి పెట్టుకున్నారని ఆరోపించారు.

 ప్రతి డ్రైవర్ కి కొటేషన్ తప్పకుండా ఇవ్వాలని, ఇప్పటివరకు డీలర్ల ద్వారా, షోరూం ఓనర్ల ద్వారా లాగిన్ చేసిన ఆటోలను క్యాన్సిల్ చేసి రవాణా శాఖ మాత్రమే లాగిన్​అయ్యేలా చూడాలని కోరుతున్నారు. అలాగే, ఆటో డ్రైవర్లను దోచుకుంటున్న ఫైనాన్షియర్లపై ఏసీబీ విచారణ జరిపించాలని భారతీయ ప్రైవేట్​ ట్రాన్స్​పోర్ట్​ మజ్ధూర్​సంఘ్​ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్​డిమాండ్​ చేశారు.