నెంబర్​ ఒక్కటే.. బండ్లు రెండు

నెంబర్​ ఒక్కటే.. బండ్లు రెండు

  కేటాయించిన నంబర్ –    ఏపీ10 యూ 7145

 1999లో గూడ్స్ క్యారియర్     వాహనానికి రిజిస్ట్రేషన్

  2002 లో ప్యాసింజర్     ఆటోకు రిజిస్ట్రేషన్

  2017లో వెలుగులోకి  వచ్చిన వ్యవహారం

  ఇప్పటికీ గూడ్స్​క్యారియర్​వెహికల్​  ఎక్కడ తిరుగుతుందో తెలియదు

 

మీ బండికి ఉన్న నంబర్ మరో బండికి ఉండదని భావిస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. ఒకే నంబర్ ను రెండు బండ్లకు కేటాయిస్తారు. అది ఆర్టీఏ అధికారుల ఇష్టం. వారికి ఎలాంటి రూల్స్ ఉండవు. వారిని అడిగే నాథుడు లేడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. చేసిన తప్పు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదుగా? ఇదిగో అలాంటిదే 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి ఆర్టీఏ పరిధిలో 1999లో గూడ్స్ క్యారియర్ ఆటోను ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అప్పుడు ఏపీ10 యూ 7145 అనే నంబర్ ను కేటాయించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 2002లో ఫిబ్రవరి 2న మళ్లీ ఏపీ 10 యూ 7145 అనే నంబర్ ను ఓ ప్యాసింజర్ ఆటో కు రిజిస్ట్రేషన్ చేసేశారు. అసలు ఒకే నంబర్ ను రెండు బండ్లకు రిజిస్ట్రేషన్ చేయటమన్నది అసాధ్యం. ఇందుకు కంప్యూటర్ సిస్టం అస్సలు సహకరించదు. కానీ ఆర్టీఏ అధికారులు తలచుకుంటే ఇలాంటవన్నీ మామూలే. కంప్యూటర్ సిస్టంకే చిక్కకుండా రెండు బండ్లకు ఒకే నంబర్ కేటాయించేశారు.

బయటపడింది ఇలా
ఈ విషయం 2017 వరకు బయటకి తెలియలేదు. రెండు వాహనాలకు ఫిట్ నెస్  టెస్ట్ లు కూడా అవుతుండటం గమనార్హం. ఆ సమయంలోనూ అధికారులు విషయాన్ని గుర్తించలేదు. ఐతే 1999లో గూడ్స్ క్యారియర్ ఆటో కొన్న వ్యక్తి తన వాహనానికి కాకినాడకు ఎన్.ఒ.సి తీసుకున్నాడు. కాకినాడలో వాహనాన్ని నడుపుకుంటున్నాడు. 2002 లో ప్యాసింజర్ ఆటో కొనుగోలు చేసిన వ్యక్తి 2010 లో వంగపల్లి కనకరాజు అనే వ్యక్తికి విక్రయించాడు. అప్పటి నుంచి 2014 వరకు ఏటా ప్యాసింజర్​ఆటోకు ఫిట్ నెస్ టెస్ట్ లు సరిగా నిర్వహించారు. 2014 నుంచి ఆటోకు ఫిట్ నెస్ టెస్ట్ లు చేయటం లేదు. మరి అధికారులు సమస్యను అప్పుడే గుర్తించారో లేదా తెలియదు కానీ ఫిట్ నెస్ టెస్ట్ లు మాత్రం చేయటంలేదు. ముూడేళ్లు అలా అధికారుల చుట్టూ తిరిగిన వంగపల్లి కనకరాజు 2017 లో పర్మిట్ రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అసలు సమస్యను ఆర్టీఏ అధికారులు కనకరాజుకు వివరించారు. వాహనం డాక్యుమెంట్లు, పర్మిట్ క్యాన్సల్ చేసి ఇదే నంబర్ పై మరో వాహనం ఉన్నట్లు వివరించారు. అప్పటి తిరుమలగిరి ఆర్టీఓ సమస్యను తెలియజేస్తూ ప్రాబ్లం మేనేజ్ మెంట్ సిస్టం పీఎమ్ఎస్ కు కంప్లైంట్ చేస్తూ తెలంగాణ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కు లేఖ రాశారు. దీంతో సెంట్రల్ సర్వర్ చెక్ చేసి ఒకే నంబర్ తో రెండు వాహనాలు తిరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కు లేఖ కూడా రాశారు. కానీ ఇప్పటి వరకు సమస్యను అధికారులు పరిష్కరించలేదు.

తప్పు అధికారులది.. శిక్ష వాహనాదారులకు
ఒకే నంబర్​ను రెండు వాహనాలకు కేటాయించి తప్పు చేసింది ఆర్టీఏ అధికారులు. కానీ శిక్ష మాత్రం ప్యాసింజర్ ఆటో కొన్న వ్యక్తికి పడుతోంది. రెండేళ్లుగా తన వాహనానికి పర్మిట్ ఇవ్వాలని కోరుతూ ప్యాసింజర్ ఆటో కొన్న వ్యక్తి ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే ఇదిగో అదుగో అంటూ తిప్పుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదు. పైగా రెండు నంబర్లు ఒకే ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రర్ అయినట్లు స్పష్టమైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు బాధితుడిని పరేషాన్ చేస్తున్నారు. కాకినాడలో ఇదే నంబర్ తో తిరుగుతున్న వాహనాన్ని పట్టుకొని ఏదో ఒక వాహనానికి మరో నంబర్ కేటాయిద్దామని భావిస్తున్నారు. కానీ కాకినాడలో తిరుగుతున్న గూడ్స్ క్యారియర్ భూతద్దం పట్టుకొని వెతికినా అధికారులకు దొరకటం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు ప్యాసింజర్ ఆటో కొన్న వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు. రెండేళ్లుగా తన ఆటోకు పర్మిట్ ఇవ్వకపోటంతో వంగపల్లి కనకరాజు  ఆటోను పక్కన పెట్టేసి జీవనాధారం కోల్పోయాడు. ఆటో సైతం పూర్తిగా పాడైపోయింది.

అప్పుడు కూడా ఇంతే
ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనలు ఆర్టీఏ అధికారులకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఒకే పర్మిట్ నంబర్ ను మూడు వాహనాలకు కేటాయించారు. AP013/297A5/PC/2001 అనే పర్మిట్ నంబర్ ను మూడు వేర్వేరు ఆటోలకు ఇచ్చారు. ఐతే ఈ విషయాన్ని గతేడాది జులైలో గుర్తించారు. మోహనరావు అనే ఆటో యాజమాని తన వాహనాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడా అధికారులదే తప్పు అయినప్పటికీ కరెక్షన్ ఫీజు కట్టాలంటూ ఆటో యజామాని కోరారు. కాగా ఇప్పటికీ  మిగతా రెండు ఆటోలను గుర్తించలేదు. 2021 నాటికి ఈ వాహనాల పర్మిట్ అయిపోతుంది. అప్పుడు పర్మిట్ రెన్యువల్ కు వస్తే మాత్రమే అధికారులు మరో రెండు ఆటోలను గుర్తించే పరిస్థితి ఉంది. అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవటం లేదు.

జీవనాధారం కోల్పోయా..
అధికారుల తప్పిదం కారణంగా రెండేళ్లుగా పర్మిట్ రాలేదు. దీంతో ఆటోను పక్కన పెట్టాను. పూర్తిగా పాడైపోయింది. నా జీవనాధారం కోల్పోయాను. నాకు సంబంధం లేని విషయంలో నేను ఎందుకు శిక్ష అనుభవించాలి. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నా. – వంగపల్లి కనకరాజు, బాధితుడు