హైదరాబాద్‌సిటీ, వెలుగు: ప్రైవేట్ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పని సరిగా కొన్ని అంశాలను పరిశీలించాలని, భద్రత విషయంలో రాజీ పడవద్దని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బస్సుల్లో ప్రమాదాలు జరిగితే బయట పడే మార్గాలున్నాయా లేవా అన్నది ముందే చూసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్తున్నారు. బస్సు రేటింగ్, రివ్యూలు చూసుకోవడంతో పాటు బస్సెక్కిన తర్వాత ఆపరేటర్లు కల్పించాల్సిన కనీస సదుపాయాలు ఉన్నాయా లేవా చెక్చేసుకోవాలంటున్నారు. ఈ చిన్న చిన్న అంశాలే మన ప్రాణాలను రక్షిస్తాయంటున్నారు.
ట్రాక్ రికార్డు, రేటింగ్స్..
ప్రధానంగా ఆయా ఆపరేటర్ల ట్రాక్‌రికార్డును పరిశీలించాలి. రేటింగ్స్కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రివ్యూస్చదివితే ఆ బస్సు డ్రైవర్ఎలా నడుపుతున్నాడు. సిబ్బంది ప్రవర్తన, బస్సు కండీషన్విషయాలన్నీ తెలుస్తాయి. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా? లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు. మంచి రేటింగ్ఉన్న బస్సుల్లోనే ప్రయాణించాలి. అలాగే, టికెట్ బుక్‌చేసుకునే సమయంలో ప్రయాణికుడి ఫోన్నంబర్మాత్రమే ఇస్తుంటారు. అలా కాకుండా ఆల్టర్నేట్నెంబర్కూడా ఇస్తే ప్రమాద సమయంలో బంధువులకు వెంటనే సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
బస్సెక్కిన తర్వాత..
బస్సులో అతి ముఖ్యమైన ఎమర్జెన్సీ గేట్ఎక్కడుందో చూసుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు దాన్ని బద్దలు కొట్టే సుత్తి ఉందో లేదో కూడా గమనించడం ముఖ్యం. ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఫైర్‌సేఫ్టీ పరికరాలు ఉంటే తప్పించుకోవచ్చు. వీటివల్ల అగ్ని ప్రమాదం పెద్దగా కాకుండా అడ్డుకోవచ్చు. బస్సులో ఫైర్సిలిండర్లు, ఫస్ట్ఎయిడ్బాక్స్ఎక్కడున్నాయో చూసుకోవాలి. చాలామంది ఇలాంటివన్నీ చూస్తే చాదస్తం అని అనుకుంటారేమోనని, మరీ భయపడుతున్నాడని హేళన చేస్తారని భావించొద్దు. ప్రతి మనిషికి అంతిమంగా ప్రాణం అనేది ముఖ్యం. దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయడానికైనా వెనుకాడకూడదు. ఎవరో ఏదో అనుకుంటారని భావిస్తే మీ ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది.
డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా?
దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నడిపే డ్రైవర్లపై ఒత్తిడి ఉంటుంది. ప్రయాణికులను ఇన్‌టైంలో చేర్చాలన్న ప్రెషర్ఒకటైతే, ఇతర బస్సు ఆపరేటర్లతో ఉన్న పోటీ కారణంగా బస్సును వేగంగా ఉరికిస్తారు. దీంతో దూర ప్రాంతాలైన ఢిల్లీ, ముంబై, షిర్డీ, పుణె, చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, తిరుపతి, వైజాగ్ వెళ్లే బస్సులన్నీ రాత్రయితే భయపడేలా వెళ్తుంటాయి. దీనికి తోడు ఇంకొందరు డ్రైవర్లు ర్యాష్డ్రైవింగ్చేస్తుంటారు. ఎదుట, పక్కన వెళ్లే వాహనాలను ఢీకొడతారా అన్న రేంజ్లో వీరి డ్రైవింగ్ఉంటుంది. ఈ తీరు లోపలున్న వారిని కూడా భయపెట్టినా కిమ్మనకుండా కూర్చుంటారు. లేదా ఈ స్పీడ్కామనే కదా అనుకుంటారు. డ్రైవర్లు ర్యాష్డ్రైవింగ్చేస్తున్నారని భావించినప్పుడు డయల్100కు గాని, సదరు ట్రావెల్స్‌కు చెందిన హెల్ప్లైన్నంబర్కు గాని కాల్చేసి చెప్తే ప్రయోజనం ఉంటుంది.
స్పీడ్ పై నియంత్రణ ఏదీ?
ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుల స్పీడ్‌కు కళ్లెం వేసేందుకు స్పీడ్‌గవర్నర్ డివైజ్‌లను ఉపయోగిస్తున్నారు. మన దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని బస్సులు తయారు చేసే సంస్థలు స్పీడ్ కంట్రోల్ డివైజ్‌లను అమర్చేవి. కొన్నేండ్ల పాటు ఇది కొనసాగినా రాను రాను బంద్‌చేశారు. దీంతో రాష్ట్రంలో స్పీడ్కంట్రోల్పై ఏ విధమైన నియంత్రణ లేకుండా పోయింది. తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 100 కిలోమీటర్లు, 4-లేన్ హైవేలపై గంటకు 90 కిలోమీటర్లు, మున్సిపల్పరిధిలోకి వచ్చే రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి.
కానీ, ట్రావెల్స్డ్రైవర్లు ఎక్కడా తగ్గడం లేదు. మొదటి నుంచి చివరి వరకు ఒకటే స్పీడ్కంటిన్యూ చేస్తున్నారు. ఈ స్పీడ్‌కు నగరంలో ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలులో తాజాగా జరిగిన ప్రమాదం నేపథ్యంలో తెలంగాణలోనూ స్పీడ్ గవర్నర్ డివైజ్‌ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఏసీ బస్సులతో జరభద్రం
లగ్జరీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఏసీ ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. దీంతో అందరు ఆపరేటర్లు దాదాపు ఏసీ బస్సులనే రోడ్లపైకి తెస్తున్నారు. అయితే, పలు సందర్భాల్లో ఈ ఏసీ బస్సులే ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోందని అధికారులు చెప్తున్నారు. ఒక బస్సు 10- నుంచి 15 గంటలు ఏకధాటిగా ఏసీని ఆపకుండా నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు.
ఎందుకంటే కంప్రెషర్, కూలింగ్ ఫ్యాన్లు, ఆల్టర్నేటర్ వంటి భాగాలు ఓవర్‌లోడ్ అవుతాయని , విద్యుత్ కనెక్షన్లు బలహీనపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఏసీ బస్సుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తాయంటున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ఆపరేటర్లంతా ఎక్కువగా ఏసీ బస్సులనే నడుపుతున్నారు. వీటి అత్యధిక వేగం, వేగంగా బ్రేకులు వేసినప్పుడు కలిగే అధిక యాంత్రిక ఒత్తిడి వల్ల వైరింగ్ లూజ్ అవుతాయంటున్నారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగితే మంటలు వ్యాప్తి చెంది నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందంటున్నారు.
ఆపరేటర్లు పాటించాల్సిన నిబంధనలు
బస్ ఆపరేటర్లు తరచూ బస్ ఫిట్నెస్ చెక్చేయించుకోవాలి. ప్రయాణికుల కోసం ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపేలా సూచనలు పెట్టాలి. ప్రమాదాలు జరిగితే వాటిని బద్దలు కొట్టేందుకు సుత్తి అందుబాటులో ఉంచాలి. ఫస్ట్ ఎయిడ్ చేసే సదుపాయం ఉండాలి.
ప్రమాదం జరిగే సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేసే ఎమర్జెన్సీ అలారం కూడా ఏర్పాటు చేసుకోవాలి. స్పీడ్లిమిట్పాటించాలి. నేషనల్హైవేలపై 80 నుంచి 90 కి.మీ.కంటే ఎక్కువ వేగంతో బస్సులను నడపొద్దు. బస్సులను ఓవర్‌లోడ్‌తో తీసుకువెళ్లకూడదు. కెపాసిటీ ఎంత ఉందో అంతే మంది ప్రయాణికులను తీసుకెళ్లాలి.
