ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు

ప్రైవేటు ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు

రూల్స్ బ్రేక్ చేస్తూ ఇష్టా రాజ్యంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ పై ట్రాన్స్ పోర్టు అధికారులు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజామున 6 గంటల వరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. రవాణాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ట్రాన్స్ పోర్టు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ కమిషనర్ కె. పాపారావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా వివిధ రూట్లకు ఇష్టా నుసారంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సులను తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. వీటిపై ఆర్టీఏ అధికారులకు పలుమార్లు కంప్లయింట్ లు కూడా వచ్చాయి. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆర్టీఏ అధికారులతో స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 300 బస్సులను అధికారులు తనిఖీ చేయగా 70 బస్సులు రూల్స్ కి విరుద్ధంగా తిరుగుతున్నట్టు గుర్తించారు. ఈ బస్సుల యాజమాన్యాలపై కేసు నమోదు చేసినట్లు ట్రాన్స్ పోర్ట్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ కమిషనర్ కె.పాపారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రా నికి ఎలాంటి ట్యాక్స్ లు కట్టకుండా ఇక్కడ నుంచి తిరుగుతున్న 18 బస్సులను సీజ్ చేశామన్నారు. బస్సుల్లో కమర్షియల్ గూడ్స్ తరలించవద్దన్న రూల్ ఉన్నప్పటికీ అక్రమంగా తరలిస్తున్న 20 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. మొత్తంగా ఈ తనిఖీల్లో బస్సుల యాజమాన్యాలకు రూ. 33 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. రూల్స్ బ్రేక్ చేసే ప్రైవేటు ట్రావెల్స్ పై చర్యలు తప్పవని పాపారావు హెచ్చరించారు. చాలా బస్సుల యాజమాన్యాలు తెలంగాణలో ట్యాక్స్ లు చెల్లించకుండానే పలు రూట్లలో బస్సులు తిప్పుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి బస్సులను సీజ్ చేస్తామన్నారు. ఇక నుంచి తరచుగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.