దసరా ‘స్పెషల్’.. 50శాతం పెరిగిన ఆర్టీసీ చార్జీలు

దసరా ‘స్పెషల్’.. 50శాతం పెరిగిన ఆర్టీసీ చార్జీలు

                లాంగ్‌‌‌‌రూట్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌ బస్సుల్లోనూ బాదుడు

                పల్లె వెలుగు బస్సులకు ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బోర్డులు పెట్టి వసూళ్లు

                సమయానికి రాని బస్సులు, జనం పడిగాపులు

                ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న రైళ్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: దసరా ‘స్పెషల్’ అంటూ ఆర్టీసీ చార్జీల మోత మోగిస్తోంది. బస్ టికెట్లపై 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. ప్రత్యేక బస్సులతోపాటు కొన్ని లాంగ్‌‌‌‌ రూట్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌ బస్సుల్లోనూ బాదుడు షురూ చేసింది. పల్లె వెలుగు బస్సులకే ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ బోర్డులు పెట్టి దోచుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సెలవులు కావడంతో ప్రయాణికులతో బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మరో వైపు ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ చార్జీలు భారీగా పెంచేశాయి.

తిరుగు ప్రయాణంలో తక్కువ ఉంటారని..

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా జనం పల్లెబాట పడుతున్నారు. బస్సులు రావడమే ఆలస్యం క్షణాల్లో సీట్లన్నీ నిండిపోతున్నాయి. ఇదే అదనుగా భావించిన ఆర్టీసీ పల్లె ప్రజలపై చార్జీల మోత మోగిస్తోంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 4,933 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. 27వ తేదీ నుంచి 1,697 బస్సులు నడుపుతోంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి 7 వరకు 3,236 బస్సులను నడపనుంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు ఆంధ్ర, కర్నాటకల్లోని పలు జిల్లాలకు బస్సులను నడుపుతోంది. తిరుగు ప్రయాణంలో ప్యాసింజర్ల సంఖ్య తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే 50 శాతం చార్జీలు అధికంగా వసూలు చేయాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

రెగ్యులర్‌‌‌‌ బస్సుల్లోనూ..

నిజానికి స్పెషల్‌‌‌‌ బస్సుల్లో మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేయాల్సి ఉంది. కానీ అన్ని బస్సుల్లోనూ ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొన్ని లాంగ్‌‌‌‌ రూట్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌ బస్సుల్లోనూ 50 శాతం అదనంగా తీసుకుంటున్నారని వాపోతున్నారు. పల్లె వెలుగు బస్సుల్లోనూ ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారంటున్నారు. ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్సులను అన్ని స్టేజీల్లో ఆపుతున్నారు. ఆ స్టేజీ స్టాప్‌‌‌‌ లేనందున స్టాప్‌‌‌‌ ఉన్న స్టేజీకి చార్జీ వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే ‘ప్రత్యేక బస్సు’ అని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినరీ బస్సులు లేకపోవడంతో తాము ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్సులు ఎక్కక తప్పడం లేదని, ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్సుల్లో ఎక్కడంతో ఇటు అదనపు చార్జీలతోపాటు ముందు స్టేజీల చార్జీలు కూడా చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇక ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ బస్సుల్లో డీలక్స్‌‌‌‌ రేట్లు వేస్తున్నారు. మరోవైపు దూర ప్రాంతాలకు వెళ్లేందుకు స్పెషల్‌‌‌‌ బస్సులు వేసినా సమయానికి రావడంలేదని, వచ్చినా సరిపోవడంలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. గంటల కొద్దీ బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

ప్రైవేటు బాదుడు

ఒకవైపు ఆర్టీసీ షెడ్యూల్‌‌‌‌ బస్సులకు రిజర్వేషన్‌‌‌‌ హౌస్‌‌‌‌ఫుల్‌‌‌‌ అవుతుండటంతో.. ప్రైవేటు ఆపరేటర్లు రంగంలోకి దిగారు. కృత్రిమ కొరత సృష్టించడానికి తమ ట్రావెల్స్‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌కు సంబంధించిన వెబ్‌‌‌‌సైట్లను బ్లాక్‌‌‌‌ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సీట్లన్నింటినీ బ్లాక్‌‌‌‌ చేసి, కృత్రిమ కొరత సృష్టించి పండుగకు ముందు తెరిచి భారీ రేట్లకు టికెట్లు విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ బస్సులు ఫుల్‌‌‌‌ రష్‌‌‌‌ ఉంటుండటంతో ఇతర ట్రావెల్స్‌‌‌‌ కూడా అదనంగా వసూలు చేస్తున్నాయి.