
- ఆర్టీసీ కండక్టర్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించిన సబ్ రిజిస్ట్రార్
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు యత్నించిన ఓ ఆర్టీసీ కండక్టర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. చంపాపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ భాస్కర్ రెడ్డి, మరో ముగ్గురు కురువ శ్రీనివాస్, బోదాసు ఆంజనేయులు, జిల్లపల్లి సంజీవ కలిసి నకిలీ ఆధార్ కార్డులతో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు యత్నించాడు.
మజీద్ పూర్లోని సర్వే నంబర్ 36/P లో ఉన్న ఓ వెంచర్ లో 237 గజాల ప్లాట్ ను తమ పేరు మీదకు చేయించుకునేందుకు అసలు ఓనర్ పేరుపై నకిలీ ఆధార్ తయారు చేశారు. కురవ శ్రీనివాస్ ను ఆ ప్లాట్ ఓనర్ గా చూపిస్తూ, భాస్కర్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఆంజనేయులు, సంజీవను సాక్షులుగా చూపించాడు. రిజిస్ట్రేషన్ కోసం అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లగా, ఆమె ఆధార్ కార్డ్ లను నకిలీవిగా గుర్తించి నిందితులను పోలీసులకు అప్పగించారు. దీంతో భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆంజనేయులు, సంజీవ కోసం గాలిస్తున్నారు.