ఇబ్రహీంపట్నం, వెలుగు: భూమి పత్రాలు కుదువ పెట్టి డబ్బులు తీసుకోగా, అప్పు ఇచ్చిన వారు ఆ భూమిని అమ్మాలని ఒత్తిడి తేవడంతో ఓ కండక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం సీఐ మహెందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లికి చెందిన చెరుకూరి యాదయ్య(49) హైదరాబాద్ లోని ఫలక్ నామా డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
తన కూతురు వివాహం కోసం మూడేళ్ల క్రితం ఎకరా 4 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన కట్ట సత్తయ్య వద్ద కుదువ పెట్టి రూ.9 లక్షలు తీసుకున్నాడు. అయితే ఆ భూమిని మరో రూ.2 లక్షలు తీసుకుని తమకు అమ్మాలని కట్టెల సత్తయ్య కుటుంబం కొన్ని రోజులుగా వేధిస్తోంది. తీసుకున్న అప్పునకు రూ.5 లక్షలు కలిపి చెల్లిస్తానన్న వినడం లేదు. కట్టెల సత్తయ్య కొడుకు హర్షవర్ధన్ భూమి అమ్మాలని కండక్టర్‌పై దాడి చేశాడు.
దీంతో మనస్తాపం చెందిన యాదయ్య గత సోమవారం ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుతుర్లున్నారు. పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్ లో గ్రామానికి తెచ్చిన డెడ్‌బాడీని నాగన్‌పల్లి చౌరస్తాలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆపేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
