అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు

అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు
  • మరో రెండు స్థలాల ష్యూరిటీతో 320 కోట్ల బ్యాంక్‌‌ లోన్‌‌
  • 3 వేల కోట్లకు ఆర్టీసీ అప్పు

హైదరాబాద్‌‌, వెలుగు: ఇటీవల పలు డిపోలకు తాళం పెట్టిన ఆర్టీసీ మేనేజ్‌‌మెంట్‌‌.. ఇప్పుడు అప్పు కోసం ఓ డిపోను బ్యాంకులో కుదువ పెట్టింది. సంస్థ అప్పులు, బకాయిలు తీర్చేందుకు ఇంకో అప్పు చేసింది. బ్యాంక్‌‌లో రూ.320 కోట్ల లోన్‌‌ తీసుకునేందుకు హైరాబాద్‌‌లోని రాణిగంజ్‌‌ డిపో–1తోపాటు మరో రెండు స్థలాలను ష్యూరిటీగా పెట్టినట్లు తెలిసింది. వచ్చిన డబ్బులతో సీసీఎస్‌‌ బకాయిలు చెల్లించారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోలు, వర్క్‌‌షాప్‌‌ షూరిటీ పెట్టి లోన్లు తీసుకున్న ఘటనలు గతంలోనూ ఉన్నాయి. జూబ్లీ బస్‌‌స్టేషన్‌‌ పక్కనున్న స్థలం, కరీంనగర్‌‌ వర్క్‌‌షాప్‌‌తోపాటు పలు డిపోలు బ్యాంకుల్లో ష్యూరిటీగా ఉన్నాయని కార్మిక నేతలు చెబుతున్నారు. 
అప్పులు కట్టేందుకు మళ్లీ అప్పు
ఆర్టీసీ అప్పులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సంస్థ అవసరాలు, జీతాలు, బకాయిలు చెల్లించడానికి బ్యాంక్‌‌ల నుంచి లోన్‌‌ తీసుకోక తప్పడంలేదు. డీజిల్‌‌ రేట్ల పెంపు, కరోనాతో నష్టాలు పెరిగాయి. ఇప్పటికే పీఎఫ్‌‌, సీసీఎస్‌‌, ఎస్‌‌ఆర్‌‌బీఎస్‌‌ తదితర డబ్బులను సంస్థ తన సొంతానికి వాడుకుంది. వీటికి బకాయిలు చెల్లించక తప్పని పరిస్థితి. ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 2125 కోట్ల లోన్‌‌ బ్యాంక్‌‌ నుంచి తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత రూ.500 కోట్లు ఒకసారి, మళ్లీ ఇప్పుడు రూ.320 కోట్లు లోన్‌‌ తీసుకున్నారు. క్రెడిట్‌‌ కోఆపరేటివ్‌‌ సొసైటీకి ఆర్టీసీ కొన్ని బకాయిలు చెల్లించింది. సొసైటీకి రూ. 700 కోట్లు బకాయి ఉండగా, రూ.240 కోట్లను ఇచ్చింది. డిసెంబర్ వరకు పెండింగ్‌‌లో ఉన్న లోన్లు, సెటిల్మెంట్లు తదితర అన్ని రకాల బకాయిలు చెల్లించనున్నారు.