సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గని కార్మికులు

సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా వెనక్కి తగ్గని కార్మికులు

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడంపై సీఎం కేసీఆర్‌‌  చాలాసార్లు మండిపడ్డారు. యూనియన్లు, కార్మికులపై తీవ్రమైన భాషతో విరుచుకుపడ్డారు. సమ్మె చట్టవిరుద్ధమని, అహంకారపూరితమని అన్నారు. ఇలా ఓవైపు తప్పుపడుతూనే మరోవైపు కార్మికులు డ్యూటీల్లో చేరాలని, లేకుంటే తొలగిస్తామని హెచ్చరించారు. సీఎం మూడు సార్లు గడువు పెట్టినా కార్మికులు వెనక్కి తగ్గలేదు.

సమ్మె ప్రారంభానికి ముందు రోజు కార్మికులను హెచ్చరిస్తూ సీఎం ఆఫీసు నోట్​ జారీ చేసింది. ‘‘కార్మికులే ఆర్టీసీని ముంచుతున్నరు. ఎవరూ సమ్మెలోకి వెళ్లొద్దు. 5న సాయంత్రం 6 గంటల్లోగా డ్యూటీలో లేని వారిని తొలగిస్తం” అని కేసీఆర్​ హెచ్చరించారు. అయినా అందరు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దాంతో 6 న సీఎం మరో నోట్​జారీ చేశారు. ‘‘డ్యూటీకి రాని కార్మికులంతా సెల్ఫ్​ డిస్మిస్​ అయినట్టే. ఇక ఆర్టీసీలో సగం ప్రైవేట్‌‌ బస్సులే. ఆర్టీసీలో మిగిలిన సిబ్బంది 1,200 మందిలోపే..” అని పేర్కొన్నారు.

గత నెల 24న హుజూర్​నగర్​ ఉప ఎన్నికల రిజల్ట్​ వచ్చాక కేసీఆర్​ ప్రెస్​మీట్​ పెట్టారు. ‘‘ఆర్టీసీ కథ ముగిసింది. అది మునగక తప్పదు. కార్మికులు రోడ్డున పడితే పడుతరు. ఒక్క సంతకంతో ఏడు వేల ప్రైవేట్‌‌ బస్సులు కొంటం. అమాయకులైతే డ్యూటీకి వస్తమని జాయినింగ్‌‌ అప్లికేషన్‌‌ పెట్టుకోవాలె’’ అన్నారు.

ఈ నెల 3న కేబినెట్​ భేటీ తర్వాత కేసీఆర్  మరోసారి మాట్లాడారు. ‘‘కార్మికులు అంతులేని కోరికలతో సమ్మెకు పోయిన్రు. ఆర్టీసీని విలీనం చేయొద్దని నిర్ణయించినం. కార్మికులకు లాస్ట్‌‌ చాన్స్‌‌ ఇస్తున్నం. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు జాయినింగ్‌‌ లెటర్స్‌‌ ఇయ్యాలె. లేకుంటే ఆర్టీసీ రహిత తెలంగాణగా మారిపోతుంది’’ అని హెచ్చరించారు.