
సికింద్రాబాద్, వెలుగు: దసరా సెలవుల నేపథ్యంలో సిటిజన్ల కోసం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సిటీలోని ముఖ్యమైన ప్రదేశాలను ఒకే రోజులో చూసే అవకాశాన్ని కల్పిస్తున్నది. ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో ప్రతి శని, ఆదివారాల్లో ఒక ఏసీ బస్సు, ఒక నాన్-ఏసీ బస్సు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్ వద్ద ఉదయం 8.30 గంటలకు బయలు దేరి రాత్రి 8.30 గంటలకు తిరిగి రానుంది.
ఈ టూర్లో బిర్లా మందిర్, గోల్కొండ కోట, దుర్గం చెరువు, బోటింగ్, కేబుల్బ్రిడ్జి, లుంబిని పార్కు తదితర ప్రదేశాలను చూడొచ్చు. ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340, నాన్ ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130గా నిర్ణయించారు. 30 మంది ప్యాసింజర్లు ఉంటే ఆర్టీసీ నిర్ణయించి ప్రదేశాల్లో కాకుండా ఆయా వ్యక్తులు ఎంపిక చేసుకున్న ప్రాంతాలకు బస్సు వస్తుందని అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం www.tsrtconline.inను సందర్శించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9959226147కు కాల్ చేయాలన్నారు.