సిటీ బస్సుల్లో పార్టిషన్స్!.. మళ్లీ బిగించే యోచనలో ఆర్టీసీ

సిటీ బస్సుల్లో పార్టిషన్స్!.. మళ్లీ బిగించే యోచనలో ఆర్టీసీ

 

  • రెండేండ్ల కింద పార్టీషన్స్​ ఏర్పాటు చేసిన ఆర్టీసీ 
  • సగం బస్సులు స్క్రాప్​కు వెళ్లడం,4 సీట్లు తొలగించాల్సి రావడంతో వెనక్కి.. 
  • మహాలక్ష్మి స్కీమ్ ​రావడంతో పెరిగిన రద్దీ
  • స్త్రీ, పురుషుల మధ్య గొడవలు, మహిళలకు ఇబ్బందులతో మళ్లీ బిగించే యోచన

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మహాలక్ష్మి పథకం అమలుతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు బస్సు ప్రయాణంపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా మహిళా ప్రయాణికులే జర్నీ చేస్తుండడంతో తీవ్రమైన రద్దీ ఏర్పడుతోంది. కొన్ని బస్సుల్లో తోపులాటలు కూడా జరుగుతున్నాయి. దీంతో మహిళలు వెనక వరకూ నిలబడాల్సి వస్తున్నది. దీంతో మగ ప్రయాణికులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారి సమస్య పరిష్కరించడానికి బస్సుల్లో పార్టీషన్స్​ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.

స్త్రీ, పురుషుల మధ్య గొడవలు 

ప్రతి ఆర్టీసీ బస్సులో ముందు ప్రదేశంలో స్ర్తీలతో పాటు వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేక సీట్లు రిజర్వ్​చేసి ఉంటాయి. మిగిలిన సీట్లలో స్త్రీ, పురుషులు ఎవరైనా కూర్చోవచ్చు. అయితే, మహాలక్ష్మి స్కీం ప్రవేశపెట్టాక మహిళలు వారి సీట్లలో కూర్చోవడమే కాకుండా, తాము కూర్చునే సీట్లనూ ఆక్రమిస్తున్నారని, తాము కూర్చోలేకపోతున్నామని పురుష ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయం గురించి కొన్ని చోట్ల  మహిళలు, పురుషులు వాదులాడుకుంటున్నారు. ‘మీరు మీ సీట్లలో కూర్చోవడమే కాకుండా జనరల్​సీట్లలోనూ కూర్చుంటే మేం ఎక్కడ కూర్చోవాలి. రెండు, మూడు సీట్లయితే ఓకే..కానీ అన్ని సీట్లను ఆక్రమిస్తే ఎట్లా ? ’ అని పురుష ప్రయాణికులు వారితో వాదిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కండక్టర్లు సైతం జోక్యం చేసుకోవడానికి జంకుతున్నారు.

 ఎవరి వైపు మాట్లాడితే ఏ మాట పడాల్సి వస్తుందోనని మీకు మీరే తేల్చుకోవాలని సలహా ఇచ్చి సైలెంట్​అయిపోతున్నారు. నగరంలోని చాలా బస్సుల్లో ఇలాంటి సీన్లు రోజూ కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో బస్సుల మధ్యలో పార్టీషన్​ఏర్పాటు చేస్తే కొంతవరకైనా సమస్య పరిష్కారం అవుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. 

రెండేండ్ల క్రితం వరకూ పార్టీషన్స్​

గ్రేటర్​పరిధిలో రోజూ దాదాపు 3 వేల బస్సులు నడుస్తున్నాయి. డీలక్స్, మెట్రోఎక్స్​ప్రెస్​, ఆర్డినరీ,ఏసీ బస్సులు ఇలా ఏ బస్సులోనూ పార్టిషన్స్​లేవు. రెండేండ్ల క్రితం వరకూ నగరంలో తిరిగే అన్ని ఆర్డినరీ, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో పార్టిషన్స్​ఏర్పాటు చేశారు. మహిళలకు కేటాయించిన సీట్ల వరకు, మిగిలిన సీట్లకు మధ్య ఒక పార్టిషన్ బిగించేవారు. 

పార్టిషన్​ఏర్పాటు వల్ల మహిళలు, పురుషుల మధ్య తోపులాటకు అవకాశం ఉండేది కాదు. తర్వాత సగానికి సగం బస్సులు స్ర్కాప్​కు వెళ్లాయి. మహాలక్ష్మి స్కీం వచ్చాక రద్దీ పెరిగింది. దీంతో కొత్త బస్సుల్లో పార్టీషన్స్​ఏర్పాటు చేయాలంటే నాలుగు సీట్లను తొలగించాల్సి వస్తోంది. దీంతో ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో పార్టీషన్స్​ఏర్పాటు చేసిన పాత బస్సుల్లోనూ తొలగించారు.  

మహిళల భద్రత కోసం కూడా..

ప్రస్తుతం అన్ని ప్రధాన రూట్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచే బస్సుల్లో తీవ్రమైన రద్దీ ఉంటోంది. స్త్రీ, పురుష ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతుండడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. తోపులాటల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పోకిరీలు మహిళలను తాకుతూ శునకానందం పొందుతున్నారు. 

మరికొన్ని చోట్ల చిన్న చిన్న చోరీలు కూడా జరుగుతున్నాయి . దీంతో పార్టీషన్​ఏర్పాటు చేయాలన్న డిమాండ్​పెరుగుతుండడంతో అధికారులు ఆదిశగా  ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సిటీలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులనే నడపనున్న నేపధ్యంలో వాటి తయారీ సమయంలోనే పార్టీషన్​లను ఏర్పాటు చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. 

పాత బస్సుల్లోనూ మళ్లీ పార్టిషన్​ ఏర్పాటుపై దృష్టిపెట్టారు.  దీనివల్ల తోపులాటలు తగ్గడమే కాకుండా పోకిరీల బెడద, చోరీలు బంద్​అవుతాయని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.