పైసల్లేవ్.. ఏం చేస్తం!

పైసల్లేవ్.. ఏం చేస్తం!
  • అప్పులు, బకాయిలు కలిపి రూ.5,200 కోట్లు
  • వీఆర్ఎస్ చెల్లింపులు ఎలాగని మల్లగుల్లాలు

హైదరాబాద్, వెలుగు: పాత బాకీలు తీర్చే పరిస్థితి లేక, ప్రభుత్వం పట్టించుకోక, కొత్త అప్పులు పుట్టే అవకాశం లేక ఆర్టీసీ ఆర్థికంగా నానాకష్టాలు పడుతున్నది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలకు తోడు కొత్తగా నెత్తిన పడనున్న చెల్లింపులతో సతమతమవుతున్నది. ఆర్టీసీ చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు రూ.5,200 కోట్లు ఉన్నాయి. ఇందులో సగం బ్యాంకులకు, మిగతా సగం ఎంప్లాయీస్​కు ఇవ్వాలి. కొత్తగా తెచ్చిన వీఆర్ఎస్​తో మరింతగా అప్పులు చేయాల్సి వస్తున్నది. ఆర్టీసీ ఎండీకి ఇప్పటికే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) లీగల్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోపు సమాధానం రాకుంటే కోర్టుకెళ్తామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టుకు వెళ్తే వెళ్లనీ.. పైసల్లేకుంటే ఏం చేస్తామన్న భావన యాజమాన్యంలో కనపడుతున్నది. 

వీఆర్ఎస్ అప్లికేషన్లు 628
వాలంటరీ రిటైర్మెంట్ స్కీం(వీఆర్ఎస్) కోసం ఆర్టీసీ జులైలో ప్రకటన ఇచ్చింది. 2,000 మంది ముందుకొస్తారని సంస్థ అంచనా వేసింది. గైడ్ లైన్స్​లో స్పష్టత లేదన్న కార్మిక సంఘాల ప్రచారంతో పెద్దగా స్పందన లేదు. 49 వేల మంది ఉద్యోగుల్లో 628 మందే ముందుకొచ్చారు. వీరంతా 20 ఏండ్ల సర్వీసు దాటినవారు కావడంతో ఒక్కొక్కరికీ రూ.30 లక్షల దాకా చెల్లించాల్సి రావచ్చని ఈ లెక్కన రూ.188 కోట్ల దాకా అవసరమవుతాయని సంఘాలు అంటున్నాయి. అయితే సంస్థ మాత్రం ఒక్కో ఉద్యోగికి రూ.20 లక్షల చొప్పున రూ.130 కోట్ల దాకా అవుతాయని చెబుతోంది.

అప్పుల తిప్పలు
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ మొత్తం రూ.1,350 కోట్లు అప్పు చేసింది. బ్యాంకులకు రూ.2,700 కోట్లు, ఎంప్లాయీస్ పీఎఫ్ ధనం రూ.1,300 కోట్లు, సీసీఎస్ కు రూ.800 కోట్లు, ఎస్ఆర్బీఎస్ కు రూ.400 కోట్లు కలిపితే అప్పులు, బకాయిల మొత్తం రూ.5,200 కోట్లు అవుతుంది. ఏటా ఆదాయం రూ.5 వేల కోట్లు ఉంటే.. ఖర్చులూ అంతే మొత్తంలో ఉంటున్నాయి. రోజుకు రూ.18 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్(లాభనష్టాలు లేని పరిస్థితి) సాధిస్తామని గతంలోనే అధికారులు చెప్పారు. కానీ రేట్లు భారీగా పెంచినా ఇప్పటికీ వారంలో ఒకటి రెండు రోజులు మినహాయిస్తే రూ.13 నుంచి రూ.14 కోట్లు దాటట్లేదు.

సీసీఎస్ నోటీసులపై మూగనోము
బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ము అటుంచితే పీఎఫ్, ఇతరాత్ర ఇవ్వాల్సిన నిధులే రూ.2,500 కోట్లు ఉన్నాయి. అంతమొత్తం ఒకేసారి ఇవ్వకున్నా, అందులో ఎంతో కొంత ఇచ్చినా ఉద్యోగులు సర్దుకుపోయే అవకాశం ఉన్నది. ఆ మాత్రం ఇవ్వడానికి కూడా సంస్థ వద్ద డబ్బులు లేవు. ఉద్యోగులు జమ చేసుకున్న పైసలు వాడుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు సీసీఎస్.. ఎండీకి లీగల్ నోటీసులు పంపింది. 15 రోజుల్లో సమాధానామివ్వాలని లేదంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించింది. సర్కారు పట్టించుకోక, అప్పులు రాక అయోమయం నెలకొంది. దీంతో కోర్టుకు వెళ్తే వెళ్లనీ అన్నట్లే కనపడుతున్నది. గతం నుంచీ కొనసాగుతున్న బకాయిలను ఇప్పటికిప్పుడు చెల్లించమంటే ఎలా అని పెద్దాఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఎప్పటికైనా ఇవ్వాల్సిందే
ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఎప్పటికైనా చెల్లించాల్సిందే. కానీ అంత పెద్ద మొత్తాన్ని ఎలా తేవాలన్న దానిపై దృష్టిపెట్టాం. సంస్థ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడమనేది నిరంతర ప్రక్రియ. దాన్ని అమలుపరుస్తాం. ఇక వీఆర్ఎస్ కు చెల్లించాల్సిన రూ.130 కోట్లపైనే చర్చిస్తున్నాం. రెవెన్యూ నుంచి ఇవ్వాలా, అప్పులు తేవాలా అన్నది నిర్ణయించి ఈ నెల చివరికి చెల్లింపులు పూర్తిచేస్తాం.
- వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఎండీ