‘‘ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపా. యుద్ధం ఆపకపోతే రెండు దేశాలపై వాణిజ్య సుంకాలు విధిస్తానని బెదిరించా. దెబ్బకు వెంటనే యుద్ధం ఆపేశాయి. ఇండియా-పాక్ మధ్య జరిగిన సైనిక ఘర్షణలో 6 యుద్ధ విమానాలు కూలిపోయాయి’’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందు దొరికితే చాలు చెప్పే మాట ఇది. ఇప్పటికే ఓ 60, 70 సార్లు ఇదే డైలాగ్‌ను రిపీట్ చేశాడు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిసి దాదాపు 6 నెలలు కావొస్తోన్న కూడా ట్రంప్ మాత్రం ఇదే పాత పాటను మళ్లీ మళ్లీ పాడుతున్నాడు. ఇదే అంశంపై తాజాగా ట్రంప్ మరోసారి మాట్లాడాడు. కాకపోతే ఈ సారి ఒక కొత్త ఆరోపణ చేశారు. ఇండియా-పాక్ సైనిక ఘర్షణల్లో కూలిపోయింది6 విమానాలు కాదు 8 విమానాలని కొత్త రాగం అందుకున్నారు.
మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరమ్‌లో ప్రసంగించిన ట్రంప్.. ఇండియా, పాక్ మధ్య సైనిక ఘర్షణలు, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. తన జోక్యం వల్లే ఇండియా, పాక్ మధ్య అణు యుద్ధం ఆగిపోయిందని పునరుద్ఘాటించారు. యుద్ధం ఆపకపోతే భారీగా వాణిజ్య సుంకాలు విధిస్తానని హెచ్చరించడంతో వెంటనే ఇరుదేశాలు యుద్ధం ఆపి కాల్పులు విరమణ ఒప్పందం చేసుకున్నాయన్నారు.
►ALSO READ | జోహ్రాన్ విక్టరీ స్పీచ్ లో నెహ్రూ ప్రస్తావన.. నెహ్రూ చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ ఎప్పటికీ మరిచిపోనని కామెంట్
ఇండియా, పాక్ సైనిక ఘర్షణల్లో మొత్తం 8 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ కొత్త ఆరోపణలు చేశారు. అయితే.. కూలిపోయిన విమానాలు ఏ దేశానికి చెందినవి అనేది మాత్రం ట్రంప్ చెప్పలేదు. కాగా, ఇండియా, పాక్ యుద్ధాన్ని తానే ఆపానన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో వ్యక్తి లేదా దేశ ప్రమేయం లేదని ఇండియా స్పష్టం చేసింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం పాత చింతకాయ పచ్చడి మాదిరి అదే పాట పాడుతున్నారు.
