ఆర్టీసీ కార్మికులకు డీఏ శాంక్షన్

ఆర్టీసీ కార్మికులకు డీఏ శాంక్షన్

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ కార్మికులకు 4.9 శాతం డీఏను యాజమాన్యం ప్రకటించింది. జులై 2022 డీఏను ఈ నెల జీతంతో కలిపి చెల్లిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ లో ఉన్న జనవరి 2023 డీఏను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా త్వరలో చెల్లిస్తామన్నారు. సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కార్మికులకు డీఏలు ఇస్తున్నామన్నారు. 

పీఆర్సీలు ఇవ్వాలి: యూనియన్లు  

ఆర్టీసీ కార్మికులకు డీఏ ప్రకటించటంపై యూనియన్ల నేతలు ఫైర్ అవుతున్నారు. 2017, 2021 పీఆర్సీలు, 2012 పీఆర్సీ బకాయిలు ఇవ్వకుండా గత ఏడాది డీఏ ఇచ్చి గొప్పలు చెప్పుకోవటం ఏంటని మండిపడుతున్నారు. మునుగోడు టైమ్ లో ఈసీ పర్మిషన్ ఇస్తే పీఆర్సీ ఇస్తమని ప్రకటన చేసి ఆ తరువాత పట్టించుకోవటం లేదని టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, జనరల్ సెక్రటరీ తిరుపతి ఒక ప్రకటనలో ఫైర్ అయ్యారు. కార్మికులకు పీఆర్సీ ఇస్తమని ఆశలు చూపించి , మోసం చేశారని అన్నారు. ఇప్పటికైనా పోరాటాలు చేయటానికి అన్ని యూనియన్లు జేఏసీగా ఏర్పడి ముందుకు రావాలన్నారు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు 7 డీఏలు ప్రకటించారని, అన్నీ లేట్ గా ప్రకటిస్తున్నారని, దీంతో ఆ బకాయిలు లక్షల్లో కార్మికులు కోల్పోతున్నారని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం డీఏ కూడా గత ఏడాది జులై నుంచి ఇవ్వాలన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రెండు పీఆర్సీలు ప్రకటించాలని టీజేఎంయూ జనరల్ సెక్రటరీ హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. 9 ఏండ్ల నుంచి ఆర్టీసీని మోసం చేస్తూ నాశనం చేశా రన్నారు. బడ్జెట్ నిధులు ఇవ్వకుండా, కార్మికుల నిధు లతోనే ఆర్టీసీని నడుపుతున్నారని ఫైర్ అయ్యారు.