యూనియన్ ఎన్నికలకు  మరో 6 నెలలు టైమ్ ఇవ్వండి

యూనియన్ ఎన్నికలకు  మరో 6 నెలలు టైమ్ ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: యూనియన్ ఎన్నికలు నిర్వహించేందుకు మరో 6 నెలలు టైమ్ ఇవ్వాలని హైకోర్టును ఆర్టీసీ మేనేజ్ మెంట్ కోరింది. ఇందులో భాగంగా హైకోర్టులో పిటిషన్ కూడా  దాఖలు చేసింది.  ఈ పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. దీనిపై  ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో సింగరేణిలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం గడువు కావాలని పిటిషన్ వేసిందని ఒక ప్రకటనలో గుర్తుచేశారు. ఇపుడు ఆర్టీసీ వ్యవహారంలోనూ  ఇలాగే వ్యవహరిస్తున్నదని తెలిపారు. టైమ్ కోరుతూ కోర్టులో  ఆర్టీసీ పిటిషన్ దాఖలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.

 సింగరేణి, ఆర్టీసీలో ఎన్నికలు పెడితే బీఆర్ఎస్  అనుబంధ  సంఘాలు ఓడిపోతాయని, దాని ప్రభావంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందనే యోచనలో  ప్రభుత్వం ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆగస్ట్ లోపు ఎన్నికలు నిర్వహించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న రెండు పీఆర్సీలు ఇవ్వాలని, వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్లను మళ్లీ అనుమతించాలన్నారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉన్న టీఎంయూలో రెండు వర్గాలు ఉన్నాయని, యూనియన్ ఎవరిదనే అంశం కోర్టులో పెండింగ్ లో ఉందని అందుకే ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని రాజిరెడ్డి  పేర్కొన్నారు.