ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీన ప్రకటన: రాములు నాయక్​

ఎన్నికల కోసమే ఆర్టీసీ విలీన ప్రకటన: రాములు నాయక్​

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీపై కేసీఆర్​ది కపట ప్రేమ అని, ఎన్నికల కోసమే విలీన ప్రకటన చేశారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్​ ఆరోపించారు. ఇది ఆర్టీసీ కార్మికులను మరోసారి మోసం చేసే ప్రయత్నమని పేర్కొన్నారు. కార్మికులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్న ఉద్దేశంతోనే కేసీఆర్​ హడావుడి ప్రకటన చేశారని అన్నారు. 

బుధవారం ఆయన గాంధీభవన్​లో పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్​ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో ఆర్టీసీ విలీనం అసలు సాధ్యమే కాదని సీఎం కేసీఆర్​అన్నారని, ఇప్పుడు కేవలం ఎన్నికల కోసమే యూటర్న్​ తీసుకున్నారని మండిపడ్డారు. ‘ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే 38 మంది చనిపోయి ఉండేవారా..’ అని ప్రశ్నించారు.
 
ఆర్టీసీ బకాయిలపై కేసీఆర్​ సమాధానమే చెప్పలేదని విమర్శించారు. సంస్థ విలీన ప్రకటన వెనుక ఆస్తులను అమ్మేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్​ పార్టీ 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టిందని గుర్తు చేశారు. కేసీఆర్​ కుట్రలకు బలికావొద్దని ఆర్టీసీ కార్మికులకు ఆయన సూచించారు.