
- టికెట్లపై 25% డిస్కౌంట్ ఇచ్చేలా ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: ఆదాయం పెంచుకునే మార్గాలపై ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. తాజాగా వృద్ధులకు 25 శాతం రాయితీ ప్రకటించేలా రాష్ట్ర సర్కారు ముందు ప్రతిపాదన పెట్టింది. ఇప్పటికే ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్ పేరుతో రాయితీలు ఇస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు 25 శాతం రాయితీ ప్రకటిస్తే, ఆ రాయితీ మొత్తం ప్రభుత్వం ప్రతి నెలా ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ ఇస్తే ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరుగుతుందని ఆర్టీసీ మేనేజ్మెంట్ చెప్తున్నది. ఈ ప్రతిపాదనను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు ఉంచి, ఆయన ద్వారా సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి అమలు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నది.
ప్రతి రోజు ఆర్టీసీలో సగటున 55 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో సీనియర్ సిటిజన్లు 15 నుంచి 20 శాతం వరకు ఉంటున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. 25 శాతం రాయితీ ప్రకటిస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, దీంతో సంస్థకు లాభాలు వస్తాయని భావిస్తున్నది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద జీరో టికెట్లతో నగదు లభ్యత తగ్గి ప్రతి నెలా ఉద్యోగులకు, డీజిల్ ఖర్చులకు, బస్సుల నిర్వహణ, ఇతర అవసరాల కోసం వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. అందుకే నగదు రాబడిని పెంచుకునే మార్గాల్లో వృద్ధులకు రాయితీ ప్రకటించడం ఒకటని అధికారులు భావిస్తున్నారు.