- బెనిఫిట్స్, బకాయిలు చెల్లించాలని డిమాండ్
- ఆడిటింగ్ తర్వాత బకాయిల చెల్లింపునకు కృషి చేస్తామన్న ఎండీ సజ్జనార్
ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీలో పదవీ విరమణ పొంది సంవత్సరాలు గడుస్తున్నా తమకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఆర్పీఎస్, సెటిల్మెంట్ల డబ్బులు రావడం లేదని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించి బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బస్భవన్వద్ద సామూహిక శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు చంద్రారెడ్డి, రంగారావు, లక్ష్మయ్య, కనకయ్య, నజీరుద్దిన్, ప్రకాశ్ మాట్లాడుతూ తక్కువ జీతాలతో పనిచేసి రిటైర్ అయ్యామని, తక్కువ మొత్తంలో వచ్చే పింఛన్‌తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.
తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, బకాయిలు సమయానికి అందక పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సభ్యుల అనారోగ్యాల ఖర్చులకు ఇబ్బంది పడుతున్నామన్నారు. ఆవేదనతో కొందరు గుండెపోటుతో చనిపోయిన సందర్భాలున్నాయన్నారు. తమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం గ్రాట్యుటీ, సీసీఎస్, టెర్మినల్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, 2017 ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని, హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ సానుకూలంగా స్పందించారని, ప్రస్తుతం ఆడిటింగ్ జరుగుతోందని, ఆడిటింగ్ పూర్తయిన తర్వాత బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. వారం వేచి చూసి తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు.
