రోగులపై సమ్మె ఎఫెక్ట్‌‌..

రోగులపై సమ్మె ఎఫెక్ట్‌‌..

జిల్లాల నుంచి హైదరాబాద్‌‌కు తగ్గిన పేషెంట్ల సంఖ్య

బస్సుల బంద్‌‌.. చార్జీల భయంతో చెకప్‌‌లు వాయిదా

ఎమర్జెన్సీ పేషెంట్లకు తప్పని చార్జీల భారం

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌‌ పేషెంట్లపై పడ్డది. జిల్లాల నుంచి హైదరాబాద్‌‌లోని పెద్దాస్పత్రులకు వచ్చే రోగులు సమ్మె కారణంగా, తమ రెగ్యులర్ చెకప్‌‌లను వాయిదా వేసుకుంటున్నారు. జిల్లా హాస్పిటళ్ల నుంచి డాక్టర్లు రిఫర్‌‌‌‌ చేసినప్పటికీ ప్రయాణ చార్జీల భయంతో నగరానికి వచ్చేందుకు ఎన్కముందైతున్నరు. హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ప్రతి సోమవారం 30 నుంచి 40% ఓపీ ఎక్కువగా నమోదవుతుంది. కానీ, ఈ సోమ, మంగళవారాల్లో 20 నుంచి 30% తక్కువగా నమోదైంది. ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లకు సగటున రోజుకు 2500 ఓపీ నమోదైతే, వారం రోజులుగా ఓపీ కౌంట్ 2 వేలు దాటడం లేదు.  ప్రైవేటు హాస్పిటళ్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లాల నుంచి చెకప్‌‌ కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య తగ్గిందని హాస్పిటళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. ఫీవర్‌‌‌‌ కేసులు తగ్గడం కూడా మరో కారణమని డాక్టర్లు అంటున్నారు. ప్రతిరోజు నగరంలోని హాస్పిటళ్లలో నమోదవుతున్న ఓపీలో జిల్లాల నుంచి వచ్చిన రోగులే 30 నుంచి 40% ఉంటారు. ఇప్పుడు దీంట్లో సగానికిపైగా తగ్గుదల కనిపిస్తోంది.

ఎమర్జెన్సీ రోగులకు తప్పని కష్టం

కార్మికుల సమ్మెతో ఆర్టీసీ బస్సుల్లోనే రెండింతలు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేటు వాహనాల కిరాయిలు చుక్కలనంటుతున్నాయి. ఈ చార్జీల భయంతో రెగ్యులర్ చెకప్‌‌లను వాయిదా వేసుకుంటున్నప్పటికీ, ఎమర్జెన్సీ పేషెంట్లకు మాత్రం చార్జీల భారం తప్పడం లేదు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి దూరప్రాంత జిల్లాల నుంచి హైదరాబాద్‌‌కు వచ్చేందుకు చార్జీల భారమే రూ.10 వేల వరకూ అవుతోంది. దీంతో ఎమర్జెన్సీ అయితే తప్ప నగరానికి వచ్చేందుకు పేషెంట్లు జంకుతున్నారు. ‘నా రెగ్యులర్‌‌‌‌ చెకప్‌‌కు రూ.వెయ్యి లోపు ఖర్చు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌‌ పోయిరాను చార్జీలే రూ.1200 అయ్యేట్టున్నయ్. అందుకే, బస్సులు నడిచినంకనే పోదామని ఆగిన’ అని పెద్దపల్లి జిల్లా, మంథనికి చెందిన టి.అశోక్‌‌ తెలిపారు.  ఒక్క అశోక్ మాత్రమే కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పేషంట్ల పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు.