సమ్మెపై కేసీఆర్ ‘కెనడా ఫార్ములా’!

సమ్మెపై కేసీఆర్ ‘కెనడా ఫార్ములా’!

మనం తలొగ్గొద్దు: మంత్రులతో సీఎం కేసీఆర్
కెనడాలో కార్మికులే దిగొచ్చిన్రు.. ఇక్కడా అదే జరుగుతది
2015లో మున్సిపల్
కార్మికులు దిగిరాలేదా
ప్రగతి భవన్ లో ఇటీవలి సమీక్షలో సీఎం కామెంట్స్!

హైదరాబాద్, వెలుగుఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 10 రోజులు దాటినా ప్రభుత్వంలో మాత్రం కదలిక రావడంలేదు. ఇద్దరు కార్మికులు ప్రాణత్యాగం చేసుకున్నా ఉలుకు పలుకు లేదు. పైగా కార్మికుల సమ్మెను తప్పుపడుతూ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ సమ్మెపై సీఎం చేసిన కామెంట్స్ ఆశ్చర్యానికి గురిచేశాయని కొందరు అధికారులు అంటున్నారు. ఈ మధ్య సమ్మె పరిణామాలపై ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ ‘‘సమ్మె విషయంలో తలొగ్గొద్దు. కెనడా ఫార్ములా అమలు చేద్దాం. కెనడాలో 30 వేల మంది సమ్మె చేశారు. అక్కడ ప్రభుత్వం తలొగ్గలేదు. చివరికి కార్మికులే కాళ్ల బేరానికి వచ్చారు. అలాగే ఇక్కడ కూడా కార్మికులు దిగి వస్తారు’’ అని అన్నట్టు తెలిసింది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపేదే లేదని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారని సమీక్షలో పాల్గొన్న ఓ అధికారి చెప్పారు.

ఇంతకీ కెనడాలో ఏం జరిగింది?

1919 మే15న కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో వివిధ ప్రభుత్వ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కార్మికులు సమ్మెకు వెళ్లారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనే ప్రధాన డిమాండ్ తో నిరసనలు చేపట్టారు. ఆరు వారాలపాటు సమ్మె చేసినా ప్రభుత్వంలో కదలిక రాలేదు. చివరికి జూన్ 21న సామూహిక మౌన దీక్షకు దిగారు. వేలాది మంది కార్మికులు పట్టణంలోకి తరలివచ్చారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మిలటరీ కాల్పులు జరిపింది. ఆ ఘటనలో ఇద్దరు చనిపోయారు. 30 మందికి గాయాలు అయ్యాయి. చివరికి జూన్ 25న సమ్మెను విరమిస్తున్నట్టు కార్మికులు ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వం విధించిన షరతులను ఒప్పుకుంటూ మెజార్టీ కార్మికులు విధుల్లో చేరారు.

ఇక్కడ కూడా అదే ఫార్ములా

కెనడాలో జరిగిన సమ్మె విషయాన్ని వివరించిన కేసీఆర్.. ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా అదే అమలు చేద్దామని అన్నట్టు తెలిసింది. కార్మికులకు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా ప్రజల సపోర్టు లేదని కామెంట్ చేశారని సమాచారం. ‘‘డ్యూటీలో చేరిన కార్మికులకే సెప్టెంబర్ జీతాలు ఇచ్చాం. జీతాలు లేకుండా ఎంత కాలం సమ్మె చేస్తారు. వాళ్లే విసిగిపోయి విధుల్లోకి వస్తారు. మీరు టెన్షన్ పడొద్దు’ అని సీఎం అన్నట్టు తెలిసింది.

జీహెచ్ఎంసీ కార్మికులు దిగి రాలేదా..

ప్రత్యేక తెలంగాణ వచ్చాక జరిగిన జీహెచ్ఎంసీ సమ్మె విషయాన్ని సీఎం ప్రస్తావించారు. 2015లో జీతాల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. జీతాలు పెంచుతామని హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. 45 రోజులపాటు సమ్మె ఉధృతంగా సాగింది. కాని ఆందోళనలు విరిమిస్తేనే జీతాలు పెంచుతామని సీఎం కేసీఆర్ షరతు విధించారు. దీంతో కార్మిక సంఘాలు దిగొచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం జీతాలు పెంచింది. ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా కార్మికులే దిగిరావాలని, అప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేసినట్టు సమాచారం.