RTC సమ్మె : అదే హోరు.. అదే జోరు

RTC సమ్మె : అదే హోరు.. అదే జోరు

గుండు కొట్టించుకుని..శవయాత్రలు,
రాస్తారోకోలతో నిరసన
రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఆందోళన ఉధృతం

వెలుగు నెట్వర్క్:ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారం ఉధృతంగా కొనసాగింది. సమ్మె పన్నెండో రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడంపై కార్మికులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, టీచర్లు, స్టూడెంట్ యూనియన్ల నాయకులు పాల్గొని ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. మహబూబ్​నగర్​జిల్లా కేంద్రంలో కార్మికులు బస్ డిపో ఎదుట ధర్నాలు, ర్యాలీలు, నిర్వహించారు. జాతీయ ఓబీసీ కమిషన్​మెంబర్ టి.ఆచారి ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కార్మికులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మతో​శవయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ దగ్గర దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వనపర్తి జిల్లాలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, వివిధ సంఘాల నాయకులతో అర్ధనగ్న ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు. నాగర్​కర్నూల్​జిల్లాలో ఆర్టీసీ కార్మికులు దున్నపోతు మెడలో పూలదండవేసి ర్యాలీ నిర్వహించారు.

బస్టాండ్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడారు. అచ్చంపేట పట్టణం అంబేద్కర్​చౌరస్తాలో మోకాళ్లపై నిరసన తెలిపారు. కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడితే సహించేదిలేదని టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్​లాల్ ప్రభుత్వాన్ని​హెచ్చరించారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట రాస్తారోకో తో పాటు మానవహారం నిర్వహించారు. కరీంనగర్ డిపో 1లో మెకానిక్ గా పనిచేస్తున్న కరుణాకర్ ఆర్టీసీని ప్రభుత్వం కత్తితో పొడిచినట్లుగా వేషధారణలో నిరసన తెలిపాడు. మెట్ పల్లి డిపోలో ట్రిమ్మర్​గా పనిచేస్తున్న శ్రీనివాస్ యాచకుడిగా మారి బస్టాండ్ లో భిక్షాటన చేశాడు. వేములవాడలో కార్మికులు కేసీఆర్​కు పిండప్రదానం చేసి, గుండు కొట్టించుకున్నారు. జగిత్యాలలోని ఆర్టీసీ డిపో ఎదుట సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఇందులో మహిళా కండక్టర్ ఉమారాణి అస్వస్థతకు గురయ్యారు. డిపోల దగ్గర 144 సెక్షన్​ అమలులో ఉండడంతో.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.