త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌‌‌‌ నాన్‌‌‌‌ ఏసీ బస్సులు..!

త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌‌‌‌ నాన్‌‌‌‌ ఏసీ బస్సులు..!
  • అన్నీ సిటీలోనే తిప్పేందుకు ప్లాన్‌‌‌‌ 
  • ఒక్కో ఎలక్ట్రిక్ బస్సుకు కేంద్రం రూ. కోటి సబ్సిడీ 
  • రూ. 300 కోట్ల రాయితీ కోల్పోనున్న ఆర్టీసీ   

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీలో ఇంకిన్ని అద్దె బస్సులు రానున్నాయి. మరో 300 ఎక్ట్రికల్‌‌‌‌ బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రభుత్వ అనుమతి కోసం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ రెండు రోజుల క్రితమే ఈ మేరకు ప్రపోజల్స్‌‌‌‌ పంపించింది. సర్కారు ఆమోదం రాగానే బస్సులను తీసుకోనున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో 3,220 అద్దె బస్సులుండగా, కొత్తగా తీసుకొనే బస్సులతో వీటి సంఖ్య 3,520కి చేరనుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఎలక్ట్రిక్‌‌‌‌ బస్సుకు ఇచ్చే రూ. కోటి సబ్సిడీ ప్రైవేట్‌‌‌‌ కంపెనీకే ధారాదత్తం కానుంది. దీంతో ఆర్టీసీ మొత్తంగా రూ.300 కోట్ల మేరకు నష్టపోనుంది. 

కొత్త బస్సులూ సిటీలోనే 
ఆర్టీసీలో 2019 సమ్మె కంటే ముందు 10,300 బస్సులు ఉండేవి. అయితే, దశలవారీగా ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం సంస్థలో 8,200 బస్సులున్నాయి. ఇందులో 3,220 అద్దె బస్సులుండగా, మిగతావి ఆర్టీసీవి ఉన్నాయి. ఆయా రూట్లను బట్టి అద్దె బస్సు ఓనర్లకు ఆర్టీసీ డబ్బులు ఇస్తుంది. దీని ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. సిటీలో కిలోమీటర్‌‌‌‌కు రూ. 55 దాకా ఖర్చు అవుతుండగా, అద్దె బస్సుల ద్వారా రూ.40కి తగ్గనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ సిటీలో 40 ఎలక్ట్రిక్‌‌‌‌ ఏసీ బస్సులు ఉండగా, ఇవన్నీ శంషాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లోనే నడుపుతున్నారు. కొత్తగా తీసుకొనే 300 బస్సులు కూడా సిటీలోనే నడుపుతారని, అయితే ఇవి నాన్‌‌‌‌ ఏసీ బస్సులని తెలిసింది. వీటిని సిటీలో నడపడం ద్వారా పొల్యూషన్‌‌‌‌ తగ్గించడంతోపాటు ఖర్చు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 

కేంద్ర సబ్సిడీ మొత్తం ప్రైవేట్‌‌‌‌కే 
ఎలక్ట్రిక్‌‌‌‌ బస్సులకు ప్రోత్సాహంలో భాగంగా ‘ఫేమ్‌‌‌‌’(ఫాస్టర్‌‌‌‌ అడాప్షన్‌‌‌‌ అండ్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ హైబ్రిడ్‌‌‌‌ అండ్ ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్‌‌‌‌) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికింద రాయితీపై రాష్ట్రాలకు బస్సులను మంజూరు చేస్తోంది. అయితే ఒక్కో బస్సు ధర రూ.3 కోట్లకు పైగా ఉండటంతో ఒక్కో బస్సుపై కేంద్రం రూ. కోటి దాకా రాయితీ ఇస్తోంది. ప్రైవేట్ సంస్థల బస్సులు ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తిరిగితే వాటికీ సబ్సిడీ ఇస్తోంది. దీంతో 300 బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తే రూ. 300 కోట్ల రాయితీ వస్తుంది. లేదంటే ఆ మొత్తం ప్రైవేట్ కంపెనీకే మిగులుతుంది.

ఏడున్నర ఏండ్లలో కొన్నవి 1,826 బస్సులే 
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఆర్టీసీ 1,826 బస్సులను మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో అధిక శాతం బస్సులు స్క్రాప్‌‌‌‌ చేయగా వచ్చిన డబ్బులతోనే కొన్నారు. ఇక ఇప్పుడున్న బస్సుల్లో సగం బస్సులను  మార్చాల్సి ఉంటుంది. ఏటా వందలాది బస్సులకు కాలం చెల్లిదంటూ స్క్రాప్‌‌‌‌ కింద తొలగిస్తున్నా కొత్తవి మాత్రం కొనడంలేదు. దీంతో సంస్థలో రోజురోజుకు బస్సులు తగ్గిపోయి.. ఎక్సెస్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ అవుతోంది. సర్కారు కూడా ఆదుకోకపోవడంతో అద్దె బస్సులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.