
హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు అర్ధరాత్రులు ప్రతి ఉద్యోగికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ఈదురు వెంకన్న, కో చైర్మన్కె.హన్మంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బి.యాదగిరి ఆరోపించారు. ప్రతిరోజు చెమటోడ్చి పనిచేసే సిబ్బంది అలసిపోయి రాత్రివేళల్లో డిపోల్లో విశ్రాంతి తీసుకుంటున్న టైంలో వారి నిద్రకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు.
డ్యూటీలో లేనప్పటికీ వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పైగా కేసులు నమోదు చేస్తూ భయపెడుతున్నారని చెప్పారు. అలాగే.. ఏడీసీ, కంట్రోలర్, గ్యారేజీ సిబ్బందిని కూడా రాత్రి వేళల్లో ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఒకపక్క ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల మీద ప్రేమ ఉన్నట్లు పైకి చెప్తూనే, ఉద్దేశపూర్వకంగా వారిని వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఇవన్నీ ఆపెయ్యాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్చేసింది.