ఫ్రీ బస్సు తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎక్కువ పని చేయాల్సివస్తుంది : హరీష్ రావు

ఫ్రీ బస్సు తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎక్కువ పని చేయాల్సివస్తుంది : హరీష్ రావు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుందని  బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్ లోడ్ వెహికిల్ నడపలేక డ్రైవర్లు, కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తుందని చెప్పారు. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని కోరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ మేరకు లేఖ రాశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటినా, ఇంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ ప్రకటించలేదని తెలిపారు.  ఎన్నికల కోడ్ రావడంతో తమ ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేకపోయిందని చెప్పారు.    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.  2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు నగదు చెల్లింపులు చేయాలని కోరారు.