
1990 దశకంలో పర్యావరణ సమస్యల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేమాట మార్పు కోరేవారి నుంచి వచ్చేది. అయినప్పటికీ, భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు అప్పటి ప్రభుత్వ వ్యవస్థ సానుకూలంగా ఉండేది. అనేక ప్రజా ఉద్యమాలు..పర్యావరణ పరిరక్షణకు తాము కోరుకున్న నిబంధనలు, చట్టాలు సాధించుకున్నాయి. కొన్ని ప్రాజెక్టులను ఆపగలిగాయి.
అయితే, గత దశాబ్దకాలంగా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు ఈ వైపరీత్యాలను కాలుష్యం, ప్రకృతి విధ్వంసంతో ముడిపెట్టిన నేపథ్యంలో కూడా భారతదేశంలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అభివృద్ధి పదాన్ని ప్రతిసారి ఎందుకు నెమరు వేస్తున్నారు? పుడమి ఉష్ణోగ్రత పెరుగుతున్నదని, అది ఇంకా పెరిగే అవకాశం ఉందని, వేడి పెరుగుదలకు మానవుల ‘అభివృద్ధి’ ప్రధాన కారణం అని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా, మరోవైపు క్లౌడ్‌బరస్ట్‌లు జరుగుతున్నా కూడా మన రాజకీయుల లోకంలో, వారి పద సంపదలో కాలుష్యం ఊసే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మానవుల మనుగడ క్రమంగా మారుతున్న, దిగజారుతున్న పర్యావరణం మీద ఆధారపడి ఉన్నకాలంలో కూడా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో పరమార్థం స్వార్ధమే.
పర్యావరణం ఊసెత్తని పాలకులు
కేంద్ర, రాష్ట్రాల పరిధుల్లో ప్రస్తావిస్తున్న ‘అభివృద్ధి’ ప్రాజెక్టులు, ప్రణాళికలు పర్యావరణ విధ్వంసం మీద ఆధారపడినవే. మౌలిక సదుపాయాల కల్పన పేరిట ప్రతిపాదిస్తున్న, అమలుచేస్తున్న భారీ ప్రాజెక్టులు అన్నీ కూడా ప్రకృతిని, చెట్లను, అడవులను, వన్యప్రాణులను, పంచ భూతాలను హరించేవిధంగా ఉన్నాయి. 30 ఏండ్ల క్రిందట కంటే భారీగా, ఘోరంగా ఉంటున్నాయి. ఒంటె మీద సూది వేస్తే దాని నడుము విరిగిపోతుంది అనే నానుడి మాదిరి ప్రకృతి విధ్వంసం చివరి దశకు, సున్నిత పరిస్థితికి చేరుకున్నా కూడా మాకు ‘అభివృద్ధి’ మాత్రమే ముఖ్యం అని సందేశం ఇస్తూ నిరంకుశంగా పాలకులు ముందుకు వెళుతున్నారు. పాలకుల లక్ష్యం ప్రజలపై ప్రేమకాదు అధికారం, సంపద, కీర్తి. స్వార్థం. తగ్గిపోతున్న వనరులలో తమ వాటా కోసం ఆరాటం.
బలహీనపడుతున్న సార్వజనీన హక్కులు
పాలకులకు అధికారం కావాలి. అధికారం కోసం ప్రజలకు హామీ ఇవ్వాలి. హామీలలో కూడా పోటీ ఉంది. కాబట్టి, ప్రజలకు స్పష్టంగా అర్థం అయ్యే హామీ, వారికి నేరుగా లబ్ధి చేకూర్చే హామీల మీద దృష్టిపెడుతున్నారు. ప్రకృతి వనరులు, ముఖ్యంగా భూమి, నీరు కొందరికే చెందేవిధంగా వ్యవస్థలు తయారవుతున్నాయి. ప్రకృతి వనరుల మీద సార్వజనీన హక్కులు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఈ విషయాల నుంచి దృష్టి మరల్చేందుకు మీకు సంక్షేమ ఫలాలు ఇస్తాం అని రకరకాల వాగ్దానాలు మొదలుపెట్టారు. అదే ఇండియా షైనింగ్, బంగారు తెలంగాణ, ఉడతా పంజాబ్, విజన్ 2050 వగైరా పేర్ల ద్వారా ప్రజల ప్రస్తుత పరిస్థితిని మార్చుతామని వాగ్దానాలు చేస్తున్నారు.
అయితే, సమ సమాజ నిర్మాణం, ప్రకృతి పరిరక్షణ గురించిగాని, వాతావరణ మార్పులను తట్టుకునే జీవావరణ వ్యవస్థ నిర్మాణం గురించిగాని మాట్లాడరు. కొందరు మేధావులు ఈ రకమైన రాజకీయ నాయకుల స్పందనను దీర్ఘకాలిక పరిష్కారాలు ప్రజలకు అర్థంకావు కాబట్టి తాత్కాలిక ప్రయోజనాలు మాట్లాడతారని విశ్లేషిస్తారు. నా దృష్టిలో అది కాదు. అభివృద్ధికి అవసరమైన వనరుల కోసం జరుగుతున్న సంఘర్షణలో పాలకులు ఎప్పుడూ కొందరికి లాభాలను చేకూర్చే వ్యవస్థకు దాసులు. ఓట్లు ప్రజలు ఇస్తే, నోట్లు ఈ ‘చీకటి’ వ్యవస్థ నుంచి వస్తాయి.
విస్తరిస్తున్న లాబీయింగ్
అమెరికా మాదిరే మన దేశంలో కూడా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి, తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ, విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. గత 20 ఏండ్లుగా లాబీయింగ్ ప్రభావం ఇంతింతై పెరుగుతున్నది. ఈ రకమైన లాబీయింగ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉన్నది. తరచుగా వారి ప్రయోజనాలకు మద్దతు ఇచ్చే సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా, వారి వ్యాపారానికి దోహదపడే విషయాలను ప్రోత్సహించడం, హానికరమైన విధానాలకు దారితీసే అధ్యయనాలను అణచివేయడం ద్వారా ఈ కంపెనీ లాబీయింగ్ వ్యవస్థ రానురాను వికృతంగా మారుతున్నది.
ఆంగ్లంలో క్రోనీ కేపిటలిజమ్ అని పిలుచుకునే ఈ రకమైన పాలక, కంపెనీ వర్గాల కలయిక చాలా వేర్లుగా భారతదేశంలో లోతుగా విస్తరిస్తున్నాయి. ప్రజాస్వామ్య సంస్థలు, వేదికలు కాకుండా వాతావరణ, పర్యావరణ సంక్షోభాలతో సహా అన్ని సంక్షోభాల పట్ల స్పందన స్థాయి, సమయం, పద్ధతి ఈ వ్యవస్థ నిర్ణయిస్తున్నది. దీనికి ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతి విజన్ డాక్యుమెంట్ అభివృద్ధి. భారత ప్రభుత్వంతో సహా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తదితర రాష్ట్రాలు అన్నీ 2047 సంవత్సరం లక్ష్యంగా తయారుచేస్తున్న ప్రణాళికల ముఖ్య భూమిక జీడీపీ పెంపుదల.
జీడీపీ పెంపుదల ముసుగు
ప్రజాస్వామ్య విలువలు, ముఖ్యంగా సమానత్వం, ప్రజల సమ్మతి వంటివి కొరవడిన ప్రణాళికకు పెడుతున్న అందమైన ముసుగు ట్రిలియన్ డాలర్ల జీడీపీ పెంపుదల. మన ప్రజలకు రూపాయలలో కాకుండా డాలర్లలో లక్ష్యం చెప్పడంలోనే ఇది దేశీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండదని చెప్పకనే చెప్పినట్టు భావించాలి. ఈ ప్రణాళికలు తయారుచేసేవి ఎక్కువ శాతం విదేశీ మూలాలున్న విదేశీ కంపెనీలు. ప్రజాధనం ఈ విధంగా కూడా అన్యాక్రాంతం అవుతున్నది. ఇక్కడి మేధావులు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలను కాదని విదేశీ కంపెనీలకు ఇచ్చే కుత్సిత సంప్రదాయం పాతబడిపోయింది.
ఇప్పుడు కొన్ని కొత్త ముసుగులు వచ్చాయి. ‘బాహ్య’ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేయడం, ప్రజలతో సంప్రదింపులు చేయడానికి ఒక వెబ్సైట్, ఒక ఈమెయిల్ వగైరా ఇచ్చి సలహాలు స్వీకరించడం పరిపాటి అయిపోయింది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి ఒక ప్రత్యేక ప్రణాళిక సంఘం ఏనాడో ఏర్పాటు అయ్యింది. అధికారంలో పార్టీ మారినప్పుడల్లా ఈ ప్రణాళిక బృందం మారుతుంది. వీరికి సకల సౌకర్యాలు ఇస్తారు. ప్రైవేటు కంపెనీ అరువు తెచ్చుకున్న ఆలోచనలను ప్రణాళికగా తయారు చేస్తారు. అందులో కొత్తగా ఏమీ ఉండదు.
పెరిగిన ఆర్థిక అసమానతలు
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. కాలుష్యం పెరిగింది. ప్రకృతి వనరుల విధ్వంసం ఎల్లలు దాటింది. సంపద కొందరికే అందుతున్నది. సగటు ప్రజల ఆరోగ్యం తెబ్బతిన్నది. మానవేతర జీవాల సంఖ్య, వైవిధ్యం పడిపోయింది. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిన నేపథ్యంలో మార్పు గురించి, సుస్థిర అభివృద్ధి గురించి చర్చ మొదలు అయ్యింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు జోడుగా డిజిటలీకరణ అవసరం గురించి ప్రతి ఒక్కరూ ఊదర కొడుతున్నారు. ప్రస్తుత సమస్యలకు విరుగుడుగా ప్రచారం చేస్తున్నారు.
ప్రజాస్వామిక పాలనలో విధిగా అందించాల్సిన ప్రజా సేవలలో డిజిటలీకరణ ద్వారా పరిణతి తీసుకు వస్తామని వాగ్దానం చేస్తున్నారు. కానీ, వ్యవస్థాగత లోపాలను డిజిటలీకరణ కార్యక్రమాలు ఎత్తి చూపుతున్నాయి. ప్రజలకు డిజిటలీకరణ ఉపయోగపడాలంటే ప్రజలతో సంప్రదింపులు, పారదర్శక అభిప్రాయ సేకరణ, ప్రభుత్వ రికార్డుల నిర్మాణం స్థానికంగానే జరపటం వంటివి అవసరం. నష్టపోతున్న అసంఖ్యాక ప్రజలే మార్పు కోరాలి. మార్పుకు నాంది పలకాలి.
ఉక్కపోతలు, వడగాడ్పులు, క్లౌడ్ బరస్ట్‌లు అన్నీ విపరీతాలే!
పాలకులు ఊసెత్తని పర్యావరణ, జీవనోపాధి అంశాలు కోకొల్లలు. వడగాడ్పులు, విపరీత ఉక్కపోత, విపరీత వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌లు, విపరీత ఎండ, చుట్టూ కాలుష్యం (గాలి, నీరు, ఘన) వంటి సమస్యలు మనిషి మనుగడనే ప్రశ్నిస్తున్నట్లుగా ఉంటున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు మానవుడిని భయపెడుతున్నాయి. కామారెడ్డి, మెదక్, సిరిసిల్లల్లో నిన్న, మొన్న వచ్చిన అతి భారీ వర్షాలు,
భారీ వరదలు తాజా ఉదాహరణ మాత్రమే.
మానవ జీవితాలను, జీవనోపాధులను భ్రష్టు పట్టిస్తున్నా కూడా వాటి గురించిన చింత లేదు. సమీక్ష లేదు. అధ్యయనం లేదు. విధానం లేదు. కానీ, వాటిని పెంచే పనులకు మాత్రం అభివృద్ధి, స్థూల ఆదాయం (జీడీపీ) వగైరా పేర్లు పెట్టి షరా మామూలే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. కలుషిత నీళ్లు, నీటి కరువు పట్టి పీడిస్తున్న కుటుంబాలు అనేకం ఉన్నా వారికి ఉపశమనం గురించిన ఆలోచన లేనేలేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్