లాక్డౌన్ లో సీజ్ అయిన బండి కావాలంటే ఇలా చేయాల్సిందే!

లాక్డౌన్ లో సీజ్ అయిన బండి కావాలంటే ఇలా చేయాల్సిందే!

కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశమంతా లాక్డౌన్ విధించారు. అయితే వాహనదారులు మాత్రం ఏవో సాకులు చెబుతూ రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి.. వాహనదారులను బెదిరించో, భయపెట్టో రోడ్లెక్కకుండా చూస్తున్నారు. ఫైన్లు వేసి ఎవరూ రోడ్ల మీదికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. కానీ, కొంతమంది వాహనాదారులు మాత్రం పోలీసుల మాటను కూడా పెడచెవిన పెడుతున్నారు. దాంతో చేసేదేంలేక.. లాక్డౌన్ టైంలో అనవసరంగా రోడ్ల మీదికొచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

అలా సీజ్ అయిన వాహనాలను విడిపించుకోవడానికి పోలీసులు కొన్ని షరతులు పెట్టారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించినందుకు ఫైన్ కట్టి, పూచికత్తు సమర్పిస్తే తప్ప బండి విడుదల చేయమని పోలీసులు కండీషన్ పెట్టారు. అలా ఫైన్ కట్టి, పూచికత్తు ఇచ్చిన వారికి ఇప్పటికే వాహనాలను కూడా ఇస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో సీజ్ అయిన వాహనాలకు సంబంధించిన కేసును కోర్టుకు సమర్పించనున్నారు. అయితే ఈ కేసు ఒక్కసారి కోర్టుకు వెళ్లిన తర్వాత.. కోర్టు ఏం చెబితే అలానే వాహనాలను విడుదలచేయవలసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు లాక్డౌన్ నియమాలను పాటించనందుకు.. కోర్టు వాహనాలను సీజ్ చేయమంటే చేస్తామని; అలాకాకుండా.. ఫైన్ కట్టించుకొని విడుదలచేయమని చెబితే అలాగే చేస్తామని పోలీసులు అంటున్నారు. ఏదేమైనా అనవసరంగా రోడ్లేక్కి.. ఇప్పుడు పోలీసుల చుట్లూ తిరగవలసి వస్తోందని వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు.