ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి పతనం: 90 మార్కు దాటేసిందిగా!

ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపాయి పతనం:  90 మార్కు దాటేసిందిగా!

డిసెంబర్ 3న భారత రూపాయి చరిత్రలోనే తొలిసారిగా ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తొలిసారిగా 90 మార్కును దాటడం ఆర్థిక నిపుణుల నుంచి ప్రజల వరకు అందరినీ కలవరపెడుతోంది.

ఈరోజు రూపాయి 89.96 వద్ద ప్రారంభమైనప్పటికీ ఇంట్రాడేలో కొద్దిసేపటికే మరింతగా జారుకుని 90.1325 స్థాయికి చేరింది. మంగళవారం రూపాయి ముగింపు ధర 89.87 వద్ద క్లోజ్ కాగా.. ఇవాళ ఊహించని పతనం వెనుక ప్రధానంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయని కరెన్సీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రూపాయి పతనానికి కారణాలు:

1. ఈక్విటీ అవుట్‌ఫ్లోస్: భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

2. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ అనిశ్చితి: రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగడం కూడా మార్కెట్‌లో అనిశ్చితిని పెంచింది. చాలా కాలం నుంచి ట్రంప్ డీల్ దగ్గర్లోనే రెండు దేశాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ అడుగులు ముందుకు పడకపోవటం ఇన్వెస్టర్లలో నిరాశను పెంచుతోంది. ఈ పరిస్థితి మరోపక్క వాణిజ్యంపై ప్రభావం పెంచుతూ డాలర్లకు డిమాండ్ కలిగిస్తోంది. 

USD/INR విలువ 88.90 నుంచి 90.20 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని CR ఫారెక్స్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పాబారి చెప్పారు. అయితే 88.80–89.00 స్థాయి గట్టి మద్దతు జోన్‌గా ఉందని పేర్కొన్నారు. ఒకవేళ 89 స్థాయి కంటే దిగువకు పడిపోతేనే రూపాయి బలం పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 మార్కు వద్ద తన సపోర్ట్ తగ్గించుకుంటే.. రూపాయి పతనంలో 91 స్థాయిని కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ట్రెజరీ హెడ్ అనిల్ భన్సాలీ హెచ్చరించారు.

ఈరోజే ఆర్బీఐ మానిటరీ సమావేశం ప్రారంభమైంది. వడ్డీ రేటు నిర్ణయాన్ని డిసెంబర్ 5న ప్రకటిస్తారు. డిసెంబర్ 10న US ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కూడా రాబోతున్న తరుణంలో రూపాయి భవితవ్యంపై అనేక ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకుంటే రూపాయి మరింతగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని, అందుకే బలహీనపడిన కరెన్సీ మానిటరీ పాలసీ పనిని మరింత కష్టతరం చేస్తుందని భన్సాలీ అన్నారు.