రూపాయి విలువ భారీగా పతనం..ఎంతంటే

రూపాయి విలువ భారీగా పతనం..ఎంతంటే
  • డాలర్ మారకంలో 77కి పడిన దేశ కరెన్సీ
  • బ్రెండ్ క్రూడ్ రేటు 139 డాలర్లను టచ్ చేయడమే కారణం
  • ఖరీదు కానున్న దిగుమతులు..
  • ఆర్బీఐ జోక్యం చేసుకునే అవకాశం

బిజినెస్‌‌‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు: చరిత్రలో ఎప్పుడూ చూడనంత లో లెవెల్‌‌కు రూపాయి విలువ సోమవారం పతనమయ్యింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం స్టార్టయినప్పటి నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ పడుతూనే ఉంది. గ్లోబల్‌‌గా బ్యారెల్‌‌ క్రూడాయిల్ రేటు 139 డాలర్లను టచ్‌‌ చేయడంతో పాటు, దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి  విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వెళ్లిపోతుండడం, డాలర్ బలపడుతుండడంతో  సోమవారం  రూపాయి విలువ ఏకంగా 93 పైసలు తగ్గింది. ఆల్‌‌ టైమ్‌‌ లో లెవెల్‌‌ అయిన 77.01 వద్ద సెటిలయ్యింది. రూపాయి విలువ మరింత పడుతుందని  ఎనలిస్టులు చెబుతున్నారు. గతంలో డాలర్ మారకంలో రూపాయికి 96.91 అత్యంత కనిష్ట స్థాయి. ఈ లెవెల్‌‌ను 2020 ఏప్రిల్‌‌ (కరోనా టైమ్‌‌) లో రూపాయి టచ్ చేసింది. 
కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతది.. 
 బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు ఈ ఏడాది మొత్తం 100 డాలర్ల పైనే కొనసాగితే, దేశ కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 3 శాతానికి పెరుగుతుందని ఎనలిస్టులు హెచ్చరిస్తున్నారు.  కరెంట్ అకౌంట్ లోటు అంటే దిగుమతులు, ఎగుమతుల మధ్య తేడా. దేశ కరెంట్ అకౌంట్ లోటు పెరిగే కొద్దీ, రూపాయిపై ఒత్తిడి కూడా పెరుగుతుందని డచ్‌‌ బ్యాంక్‌‌ ఓ నోట్‌‌లో పేర్కొంది. డాలర్ మారకంలో రూపాయి ఇప్పటికే 76 లెవెల్‌‌ దాటి,  77 లెవెల్‌‌కు చేరుకుందని  తెలిపింది. డాలర్లను అమ్మడం వంటి చర్యల ద్వారా రూపాయి పతనాన్ని ఆర్‌‌‌‌బీఐ ఆపే అవకాశాలు ఉన్నాయని వివరించింది. కాగా, డాలర్ –రూపాయి మే ఫ్యూచర్స్ రేటు 78 వద్ద ట్రేడవుతోంది.  డాలర్ మారకంలో రూపాయి విలువ పడుతుండడానికి మరో కారణం దేశ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వెళ్లిపోతుండడమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 84,131 కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేసినట్టు ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌ డేటా ద్వారా తెలుస్తోంది. 
రూపాయి పతనానికి నాలుగు కారణాలు..
రూపాయి విలువ పడడంలో నాలుగు అంశాలు పనిచేస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండడం, డాలర్‌‌‌‌కు డిమాండ్‌‌ క్రియేట్ అవ్వడం, విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్లు వెళ్లిపోతుండడం, క్యారీ ట్రేడ్‌‌ను అన్‌‌వైండింగ్ (పొజిషన్లను క్లోజ్ చేయడమని చెప్పొచ్చు) వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్‌‌ వైస్ ప్రెసిడెంట్‌‌ (కరెన్సీ డెరివేటివ్స్‌‌) ఆనింద్య బెనర్జీ అన్నారు. క్యారీ ట్రేడ్‌‌ వైండింగ్ అంటే..తక్కువ వడ్డీ రేట్లు ఉన్న దేశాల్లో లోన్లు తీసుకొని ఎక్కువ వడ్డీ ఇచ్చే దేశాల్లో ఇన్వెస్ట్ చేసి లాభపడడం.

 ప్రస్తుతం ఇటువంటి ట్రేడ్‌‌లను ఇన్వెస్టర్లు తగ్గించుకుంటున్నారు (అన్‌‌వైండింగ్‌‌) . డాలర్ మారకంలో రూపాయి పతనానికి ఇదొక కారణంగా ఉందని బెనర్జీ చెప్పారు. ‘రూపాయి విలువ 77 దగ్గర సెటిలయ్యాక, ఈ వారంలోనే 78 వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ ధరలు తగ్గితే రూపాయి తిరిగి కోలుకోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. రూపాయిపై ఒత్తిడి పెరిగిందని, 76.30–77.30‌‌‌‌ లెవెల్ మధ్యలో కొంత కాలం ట్రేడవుతుందని రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనావేసింది. విదేశీ ఇన్వెస్ట్‌‌మెంట్ల అవుట్‌‌ ఫ్లో పెరిగినా, ఆయిల్ రేట్లు ఎక్కువైనా,  డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత పడుతుందని ఫస్ట్‌‌రాండ్‌‌ బ్యాంక్ ట్రెజరర్‌‌‌‌ హరిహర్‌‌‌‌ క్రిష్ణమూర్తి పేర్కొన్నారు. 
ఆర్‌‌‌‌బీఐ జోక్యం ఉంటుందా?
రూపాయి పతనాన్ని ఆపడానికి ఆర్‌‌‌‌బీఐ డాలర్లను అమ్మడం వంటి చర్యలు చేస్తుంది. ఈ సారి  అలాంటి చర్యలు ఉండకపోవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. రూపాయి విలువ మరింత పడేంత వరకు ఆర్‌‌‌‌బీఐ వెయిట్ చేయొచ్చని అంటున్నారు.  రూపాయి విలువ పడితే దేశ ఎక్స్‌‌పోర్ట్స్‌‌కు సాయంగా ఉంటుందని, క్రూడ్‌‌ ఆయిల్ రేట్లు పెరగడంతో పెరిగిన దిగుమతులు–ఎగుమతుల మధ్య గ్యాప్‌‌ తగ్గడానికి రూపాయి విలువ పతనం సాయపడుతుందని అంటున్నారు. కాగా, రూపాయి విలువ పడితే దిగుమతులు మరింత ఖరీదుగా మారతాయని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే ఖరీదుగా మారిన క్రూడ్ దిగుమతులు, రూపాయి పతనంతో మరింత ఖరీదుగా మారుతాయి. దేశ దిగుమతుల్లో మెజార్టీ వాటా క్రూడాయిల్‌‌దే ఉంది. 
14  ఏళ్ల గరిష్టానికి క్రూడాయిల్ రేట్లు.. 
రష్యా నుంచి క్రూడాయిల్‌‌‌‌ను, గ్యాస్‌‌ను బ్యాన్ చేయాలనే అంశాన్ని  వెస్ట్రన్ కంట్రీలు పరిశీలిస్తుండడంతో  గ్లోబల్‌‌గా క్రూడాయిల్ రేట్లు సోమవారం మరింతగా పెరిగాయి.  ఇప్పటి వరకు రష్యా క్రూడాయిల్‌‌, గ్యాస్‌‌పై ఎటువంటి రిస్ట్రిక్షన్లను వెస్ట్రన్ కంట్రీలు పెట్టలేదు. ఉక్రెయిన్‌‌–రష్యా సంక్షోభం మరింత ముదురుతుండడంతో రష్యాపై మరిన్ని ఆంక్షలు పెట్టాలని ఈ దేశాలు  చూస్తున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ రేటు సోమవారం 139.13 డాలర్లను టచ్ చేసింది.  ఈ లెవెల్‌‌ నుంచి కిందకి పడి  125 డాలర్ల  వద్ద ట్రేడవుతోంది. 2008 జులైలో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ రేటు ఆల్‌‌టైమ్ హై అయిన 145.29 డాలర్లను టచ్ చేసింది.  మరోవైపు లిబియాలోని రెండు  ఆయిల్‌‌ ఫీల్డ్‌‌లను ఆర్మ్​డ్​  గ్రూప్‌‌ ఒకటి మూసేసిందనే వార్తలు వచ్చాయి.

ఈ చర్యతో లిబియా రోజువారి ఆయిల్ ప్రొడక్షన్ 3,30,000 బ్యారెళ్లు తగ్గింది.  రష్యా–-ఉక్రెయిన్‌‌ యుద్ధం ఇప్పట్లో ఆగేటట్టు కనిపించడం లేదని, దీంతో క్రూడాయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని  మెక్‌‌లై ఫైనాన్షియల్‌‌ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్‌‌ కాజి అన్నారు. క్రూడాయిల్ రేట్లు ఇంతలా పెరగడాన్ని 2008 గ్లోబల్‌‌ ఫైనాన్షియల్ క్రైసిస్‌‌ టైమ్‌‌లో చూశామని చెప్పారు. ఆయిల్ రేట్లు పెరిగితే దేశ కరెంట్ అకౌంట్‌‌పై నెగెటివ్ ప్రభావం పడుతుందని  రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) సుగంధ సచ్‌‌దేవా అన్నారు. క్రూడ్ రేటు 10 డాలర్లు పెరిగితే, దేశ ఇన్‌‌ఫ్లేషన్ 24 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని చెప్పారు. 
ఆల్‌‌‌‌టైమ్‌‌ హైకి చేరువలో గోల్డ్ రేట్లు.. 
ఉక్రెయిన్‌‌–రష్యా యుద్ధంతో సేఫ్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లయిన గోల్డ్‌‌, డాలర్ల వాల్యూ భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం గోల్డ్ రేట్లు తమ ఆల్‌‌టైమ్ హైకి చేరువలో ట్రేడవుతున్నాయి. సోమవారం ఎంసీఎక్స్‌‌లో  గోల్డ్‌‌ ఫ్యూచర్స్ ( మార్చి) రేటు రూ. 53,700 (10 గ్రాములు) ను టచ్ చేసింది. 2020, ఆగస్ట్‌‌లో గోల్డ్‌‌  ఫ్యూచర్స్ రేటు రూ.   56,200 వద్ద ఆల్‌‌ టైమ్ రికార్డ్‌‌ను టచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌‌లో  ఔన్సు గోల్డ్ రేటు 2,000.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత 18 నెలల్లో గోల్డ్‌‌కు ఇదే హయ్యస్ట్‌‌ లెవెల్‌‌.  సిల్వర్ రేటు రూ. 70,900 (కేజి) లెవెల్‌‌లో ట్రేడవుతోంది.

గోల్డ్ ఈటీఎఫ్‌‌లలోకి భారీగా ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ‘డాలర్ బలపడుతున్నా, గోల్డ్‌‌, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌‌–రష్యా సంక్షోభంతో   గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లు క్రాష్‌‌ అవుతున్నాయి.  దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ ఎక్కువగా ఉండే అసెట్ల నుంచి తమ ఇన్వెస్ట్‌‌మెంట్లను త గోల్డ్‌‌ వంటి సేఫ్ అసెట్లలో పెడుతున్నారు’ అని మెహతా ఈక్విటీస్‌‌ వైస్ ప్రెసిడెంట్‌‌ రాహుల్‌‌ కాలాంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.