రూపాయి రికార్డ్ పతనం : డాలర్‌తో 93 రూపాయలు.. ఆల్‪టైం లో..

రూపాయి రికార్డ్ పతనం : డాలర్‌తో 93 రూపాయలు.. ఆల్‪టైం లో..

భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు గడ్డుకాలం ఎదురవుతోంది. ఒకవైపు ఇరాన్ యుద్ధం రోజుల నుంచి వారాలు, నెలల వైపు సాగటం కష్టాలను పెంచేస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి చేరుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు దేశీయ కరెన్సీని పాతాళానికి నెట్టేస్తున్నాయి. మార్చి 19న భారత రూపాయి చరిత్రలోనే ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవటం ఆందోళనలు పెంచేస్తోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారి 93 మార్కును దాటి 93.24 స్థాయికి పడిపోవటం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి దాదాపు 2 శాతం మేర క్షీణించింది.

గల్ఫ్ దేశాల్లోని ఇంధన వనరులే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గురువారం నాటికి బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరువయ్యాయి. భారత్ తన క్రూడ్ అండ్ గ్యాస్ అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్న తరుణంలో.. ఈ ధరల పెరుగుదల కరెన్సీపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3.5–3.75 శాతం శ్రేణిలో కొనసాగిస్తూ 'హైయర్ ఫర్ లాంగర్' పాలసీని అనుసరిస్తుండటంతో డాలర్ మరింత బలపడుతోంది. ఫలితంగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ నుంచి మార్చి నెలలోనే 8 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. ఇది 2025 జనవరి తర్వాత అతిపెద్ద నెలవారీ అవుట్‌ఫ్లో. రూపాయిలో ఇన్వెస్ట్మెంట్ కంటే డాలర్ల రాబడులు అధికంగా ఉండటం ఇన్వెస్టర్ల ప్లాన్స్ మార్చేస్తోందట.

ఈ పరిణామాలు చూస్తుందే భారత ఆర్థిక వ్యవస్థకు ముందున్నవి సవాలుతో కూడిన రోజులే అని అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రూపాయి పతనం కేవలం నంబర్లకు పరిమితం కాకుండా, సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఆర్థిక వేత్తల విశ్లేషణ ప్రకారం భారత్‌ ముందున్న కొన్ని సవాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పెరగనున్న ద్రవ్యోల్బణం: ముడిచమురు ధర ప్రతి 10 డాలర్లు పెరిగితే.. దేశీయ ద్రవ్యోల్బణం 50 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని అంచనా. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలు 3.8 శాతం నుండి 4.5 శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి.
  2. దిగుమతుల భారం: రూపాయి బలహీనపడటం వల్ల మనం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, ముడిసరుకు, యంత్రాల ధరలు పెరిగి తయారీ రంగంపై భారం పడుతుంది.
  3. వృద్ధి రేటుపై నీలినీడలు: ద్రవ్యోల్బణం పెరిగితే వినియోగం తగ్గి, అది దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుంది. అయితే భారత మూలాలు బలంగా ఉండటంతో 2027 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధ్యమని నిపుణులు భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణిగితేనే రూపాయి కోలుకునే అవకాశం ఉంటుంది.