అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థలో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఇంట్రాడేలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయిలో 91.95 వద్దకు పడిపోయింది. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, ముడిచమురు ధరల పెరుగుదల, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు అంటున్నారు.
రూపాయి విలువ ఇంత భారీగా పడిపోవడం వల్ల దేశీయంగా దిగుమతులు ప్రియమవుతాయి. ముఖ్యంగా భారత్ తన అవసరాలకు సరిపడా ముడిచమురులో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. డాలర్ బలపడటం వల్ల చమురు దిగుమతి కోసం మనం చెల్లించే మొత్తం పెరుగుతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి రవాణా ఖర్చులు భారమవుతాయి. ఇది అంతిమంగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే ప్రమాదం ఉంది.
►ALSO READ | నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 769 పాయింట్లు పతనం.. పెట్టుబడిదారుల 6 లక్షల కోట్లు ఆవిరి..
మరోవైపు.. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయి. డాలర్లలో ఫీజులు చెల్లించాల్సి రావడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుంది. అయితే రూపాయి పతనం వల్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు చేసే ఐటీ కంపెనీలకు, ఫార్మా రంగానికి కొంతవరకు లాభం చేకూరనుంది. ఎందుకంటే వారికి ఆదాయం డాలర్ల రూపంలో వస్తుంది కాబట్టి.
రిజర్వ్ బ్యాంక్ రూపాయి పతనాన్ని అరికట్టడానికి డాలర్లను విక్రయించడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ, అంతర్జాతీయ అనిశ్చితి ముందు రూపాయి నిలదొక్కుకోవడం సవాలుగా మారింది. ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి డాలర్ వైపు మొగ్గు చూపుతుండటంతో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది.
