రూపాయి రికార్డు పతనం: డాలర్‌తో పోలిస్తే 94.30 వద్ద చరిత్రలో కనిష్టానికి

రూపాయి రికార్డు పతనం: డాలర్‌తో పోలిస్తే 94.30 వద్ద చరిత్రలో కనిష్టానికి

భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో మునుపెన్నడూ లేనంతగా పతనమైంది. శుక్రవారంట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మొదటిసారిగా 94 మార్కును దాటి 94.30 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, దానివల్ల తలెత్తిన ఇంధన సంక్షోభం రూపాయిని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ ఏడాది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలన్నింటిలోనూ రూపాయి అత్యంత అధ్వాన్నమైన కరెన్సీగా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం పతనం దిశగా సాగుతోంది.

రూపాయి పతనానికి ప్రధానంగా ముడిచమురు ధరలు పెరగడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్ల దిశగా దూసుకుపోతున్నాయి. భారత్ తన అవసరాల కోసం దిగుమతి చేసుకునే వస్తువుల్లో చమురు వాటా దాదాపు 30 శాతం ఉంటుంది. చమురు ధర బ్యారెల్‌కు ప్రతి 10 డాలర్లు పెరిగినప్పుడల్లా భారత్ అదనంగా 14 నుంచి 16 బిలియన్ డాలర్ల దిగుమతి బిల్లును భరించాల్సి వస్తుంది. ఇది దాదాపు రూ.లక్షా 50వేల కోట్లకు సమానం. ఇది దేశ కరెంట్ అకౌంట్ లోటును పెంచి, రూపాయి పునాదులను బలహీనపరుస్తోంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగానే ఉంచే అవకాశం ఉండటం, సురక్షితమైన పెట్టుబడిగా భావించి ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపడం కూడా రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయి.

ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్ల నుండి తమ పెట్టుబడులను వేగంగా వెనక్కి తీసుకుంటున్నారు. భారత్ వద్ద దాదాపు 716 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నప్పటికీ, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్‌బీఐ ఎంతవరకు జోక్యం చేసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. చమురు ధరలు పెరుగుతున్న సమయంలో నిల్వలను అతిగా ఖర్చు చేయడం మంచిది కాదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఆర్‌బీఐ రూపాయి విలువను క్రమంగా తగ్గనిస్తూనే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.

రాబోయే రోజుల్లో రూపాయి విలువ మరింత పడిపోయి 95 నుంచి 96 స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బెర్న్‌స్టెయిన్ వంటి సంస్థలు అయితే రూపాయి 98 స్థాయికి పడిపోయినా ఆశ్చర్యం లేదంటోంది. ఈ పతనం వల్ల ఐటీ, టెక్స్‌టైల్స్ వంటి ఎగుమతి రంగాలకు కొంత మేర ఆదాయం పెరిగినప్పటికీ.. విమానయాన సంస్థలు, ఆటోమొబైల్, పెయింట్స్ రంగాలకు ముడిసరుకు ఖర్చులు పెరిగి లాభాల మార్జిన్లు తగ్గే ప్రమాదం ఉంది. యుద్ధం ముగిసి చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే తప్ప రూపాయికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా లేదు.