రోజురోజుకూ పడిపోతున్న రూపాయి: డాలర్‌తో 89.92కి చేరిన విలువ.. 90 దాటితే పరిస్థితి ఇదే..

రోజురోజుకూ పడిపోతున్న రూపాయి: డాలర్‌తో 89.92కి చేరిన విలువ.. 90 దాటితే పరిస్థితి ఇదే..

భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్ తో పోల్చితే పతనం కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో రూపాయి యూఎస్ డాలర్‌తో మారకపు విలువ 89.92 వద్ద సరికొత్త చారిత్రక కనిష్టాన్ని తాకింది. ఇది సోమవారం నమోదైన 89.78 రికార్డుకు మించిన పతనంగా ఉంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చితే 4.85 శాతం పతనాన్ని నమోదు చేసింది. 

నవంబర్ 3 నుంచి చూస్తే.. రూపాయి విలువ డాలర్‌తో ఏకంగా ఒక రూపాయికి పైగా పడిపోయింది. ఈ పతనం కేవలం కొన్ని రోజుల ముందు ప్రభుత్వం ప్రకటించిన రెండవ త్రైమాసిక బలమైన 8.2% GDP తర్వాత జరిగింది. అలాగే మరికొన్ని రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశాలకు ముందు జరగటం గమనార్హం. 

రూపాయి పతనానికి కారణాలేంటి..?

రూపాయి పతనానికి ప్రధానంగా రెండు అంశాలు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. మెుదటిద గత కొద్ది రోజుల్లో నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్(NDF) కాంట్రాక్టుల గడువు ముగియటమేనని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన ఆనంద్య బెనర్జీ అన్నారు. వీటిని కవర్ చేయడం లేదా రోల్ ఓవర్ చేయడం కోసం మార్కెట్‌లో డాలర్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఇక రెండవ కారణం విదేశీ పెట్టుబడిదారుల ప్రవర్తన. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) నిరంతరంగా భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటూ, రోజువారీగా డాలర్లను కొనుగోలు చేయడం కూడా రూపాయిపై ఒత్తిడి పెంచిందని డీఎస్పీ ఫైనాన్స్‌కు చెందిన జయేష్ మెహతా వెల్లడించారు. ఈ ఒత్తిడి సమయంలో RBI నుంచి పెద్దగా దీనిని నిరోధించే ప్రయత్నాలు కనిపించలేదని బెనర్జీ చెప్పారు. 

రూపాయి విలువ పతనం '90' దాటితే ప్రమాదమా..?

డాలర్-రూపాయి మారకం విలువ ఒకవేళ 90 మార్కును దాటేస్తే.. చాలా మంది వ్యాపారులు నష్టాలను తగ్గించుకునేందుకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రూపాయి విలువ మరింత వేగంగా క్షీణించి.. 91 మార్కు వైపు దూసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే 90 మార్కును దాటకుండా నిరోధించేందుకు ఆర్‌బీఐ డాలర్లను విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రారంభ బలహీనత తర్వాత ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం 89.76 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు 2026 మార్చి వరకు రూ.2 లక్షల కోట్ల విలువైన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ప్రకటించి రూపాయికి మద్దతు ఇవ్వాలన్నారు జయేష్ మెహతా.

ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న నెక్స్ట్ ఏంటి అన్నదే. ఈ క్రమంలో రానున్న రిజర్వు బ్యాంక్ మానిటరీ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ మార్కెట్ల డైనమిక్స్‌ రూపాయి భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. మార్కెట్ వర్గాలు ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.