- ‘వాడా’ సంచలన నిర్ణయం
- టోక్యో ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌కు దూరం
- ఇంటర్నేషనల్ హోస్టింగ్‌కూ నో చాన్స్
అందరూ అనుకున్నదే జరిగింది..! క్రీడాలోకంపై ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కిన రష్యాపై ‘వాడా’ కొరడా ఝుళిపించింది..! దేశంలో జరిగిన అతిపెద్ద డోపింగ్ కుట్రను ఛేదించడమే కాకుండా దానిని నిరూపిస్తూ కఠిన చర్యలు తీసుకుంది..! చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రష్యా పన్నిన పన్నాగాలను బయటపెట్టి ప్రపంచ దేశాల ముందు తలదించుకునేలా చేసింది..! ఫలితంగా ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌తో పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌కు రష్యాను దూరం చేసిన అంతర్జాతీయ యాంటీ డోపింగ్ బాడీ..నాలుగేళ్ల పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్లలో పాల్గొనకుండా, ఆతిథ్యమివ్వకుండా వేటు వేసింది..! మొత్తానికి ‘మాస్ డోపింగ్’తో క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచిన రష్యా ఇప్పడు ఏం చేస్తుందన్నది అతిపెద్ద ప్రశ్న..!!
లుసానే (స్విట్జర్లాండ్):
అత్యుత్తమ ఫలితాలతో, పెర్ఫామెన్స్‌తో క్రీడా ప్రపంచాన్ని ఏలాలని భావించిన రష్యాకు అతిపెద్ద షాక్ తగిలింది. మాస్ డోపింగ్‌కు పాల్పడిన రష్యాపై నాలుగేళ్ల పాటు బ్యాన్ విధిస్తూ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో టోక్యో–2020 ఒలింపిక్స్‌తో పాటు 2022 వింటర్ ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రష్యా పాల్గొనే అవకాశం లేకుండా చేసింది. డోపింగ్‌పై విచారణ జరుపుతున్న అధికారులకు మాస్కో ల్యాబ్‌ల నుంచి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందనే కారణంతో సమీక్ష కమిటీ ఈ బ్యాన్‌ను ప్రతిపాదించింది. దీనిపై మరోసారి చర్చించిన వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ‘ప్రతిపాదనల పూర్తి జాబితాకు ఏకగ్రీవ ఆమోదం లభించింది’ అని వాడా అధికార ప్రతినిధి జేమ్స్ ఫిట్జ్‌గెరాల్డ్ తెలిపారు. దీంతో రష్యా అథ్లెట్లు తటస్థులుగా ఉంటేనే ఒలింపిక్స్‌లాంటి మెగా టోర్నీల్లోకి ఆడేందుకు అనుమతి ఇస్తారు. అలాగే స్టేట్ స్పాన్సర్డ్ డోపింగ్‌లో తాము భాగస్వాములు కాలేదని ఓ హామీ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాడా విధించిన ఈ రూల్స్.. వరల్డ్ చాంపియన్‌షిప్, సాకర్ వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగే రష్యా టీమ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే దానిపై స్పష్టత లేదు. ఇక వాడా నిషేధంపై 21 రోజుల్లో ‘కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్’లో అప్పీలు చేసుకోవచ్చు.
సన్నాహాకాలకు దెబ్బ..
టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది సమయం కూడా లేదు. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే రష్యాతో చాలా దేశాలు సన్నాహాకాలు కూడా మొదలుపెట్టాయి. వాడా తాజా నిర్ణయంతో రష్యా సన్నాహాకాలకు ఎదురుదెబ్బ తగిలినట్లే. దేశంపై బ్యాన్ విధించడంతో అథ్లెట్లు కూడా సందిగ్ధంలో పడ్డారు. న్యూట్రల్ ఫ్లాగ్ కింద ఆడి పతకం సాధిస్తే రష్యా అందించే ప్రోత్సాహకాలు దక్కవు. ఒకవేళ ఆడకపోతే తర్వాతి ఒలింపిక్స్ వరకు కెరీర్ కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రష్యా అథ్లెట్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అలాగే రష్యా గవర్నమెంట్ కూడా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడటంతో పాటు బ్యాన్‌ను తొలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

అసలేం జరిగింది..?
క్రీడా ప్రపంచాన్ని ఏలడమే లక్ష్యంగా పెట్టుకున్న రష్యా 2011–15 మధ్య భారీ కుట్ర చేసింది. 2014లో సోచీలో జరిగిన వింటర్ ఒలింపిక్స్ వేదికగా అతి పెద్ద డోపింగ్ కుంభకోణానికి తెరలేపింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. క్రీడాశాఖ అధికారులతో కలిపి పెద్ద ఎత్తున డోపింగ్‌కు పాల్పడటంతో పాటు తప్పు బయటపడకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. అప్పటి రష్యన్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(ఆర్‌యూఎస్‌ఏడీఏ) డైరెక్టర్ గ్రిగోరీ రమదనోస్కితో కలిసి అథ్లెట్‌లకు నిషేధిత ఉత్ప్రేరకాలు అందజేసింది. మూడు రకాల నిషేధిత డ్రగ్స్‌తో గ్రిగోరీ తయారు చేసిన కాక్‌టైల్‌ను పెద్ద సంఖ్యలో అథ్లెట్‌లకు లిక్కర్‌లో కలిపి ఇచ్చింది. అంతకంటే నెలల ముందే ఆయా అథ్లెట్‌ల యూరిన్ శాంపిల్స్‌ను సేకరించి భద్రపరిచింది. డ్రగ్స్ తీసుకున్న అథ్లెట్‌లు మెడల్స్ సాధించగానే రాత్రికిరాత్రే మాస్కోలోని వాడా అనుబంధ ల్యాబ్‌లో ఉన్న శాంపిల్స్‌ను రహస్యంగా మార్చేసింది. ల్యాబ్‌లో ఓ గోడకు చేయి మాత్రమే పట్టేంత కన్నంపెట్టి గుట్టుచప్పుడు కాకుండా పని కానిచ్చింది. అంతేకాక ల్యాబ్‌లోని పలు ఆధారాలను ధ్వంసం చేసింది.
వింటర్ గేమ్స్ ముగిసే నాటికి దాదాపు వంద శాంపిల్స్‌ను ఈ విధంగా మార్చేసింది. దీంతో అథ్లెట్‌లు ఎవ్వరూ డోప్ టెస్ట్‌లో దొరకలేదు. అయితే 2016లో ఓ ఇండిపెండెంట్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ద్వారా ఈ కుట్ర బట్టబయలైంది. ఆ తర్వాత ఆర్‌యూఎస్‌ఏడీఏ డైరెక్టర్ పదవికి గ్రిగోరీ బలవంతంగా రాజీనామా చేశారు. అతని అసిస్టెంట్‌ల్లో ఇద్దరు హత్యకు గురయ్యారు. అప్పటికే గ్రిగోరీని విచారించి ఆధారాలు సేకరించిన వాడా అధికారులు అతన్ని లాస్ ఏంజిల్స్ తరలించారు. అక్కడ ఓ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను గ్రిగోరీ బహిర్గతం చేశాడు. అప్పట్నించి విచారణ చేపట్టిన వాడా.. రకరకాల ఆధారాలను సేకరించే పనిలో పడింది. ఆ క్రమంలో మాస్కో ల్యాబ్‌ల్లోని డేటాబేస్‌ల నుంచి సమాచారాన్ని కోరగా రష్యా తప్పుడు విలువలతో కూడా డోపింగ్ రికార్డులను ఇచ్చింది. దీనికితోడు విచారణకు కూడా సహకరించకపోవడంతో 2016 రియో ఒలింపిక్స్, 2018 పెంగ్‌చాంగ్ వింటర్ గేమ్స్‌లోనే బ్యాన్ పడాల్సింది. కానీ వాడా అథ్లెట్స్ కమిషన్ వ్యతిరేకించడంతో రష్యా తప్పించుకుంది.
గెలవడం కష్టమే!

మాస్కో: నాలుగేళ్ల బ్యాన్‌పై అప్పీల్‌కు వెళ్లినా గెలవడం కష్టమేనని రష్యా యాంటీ డోపింగ్ చీఫ్ యూరీ గనాస్ అన్నాడు. క్లీన్ అథ్లెట్లకు ఈ అంశం ఓ ట్రాజెడీ అని చెప్పాడు. ‘కోర్టులో ఈ కేసు గెలవడం కష్టమే. ఇదో పెద్ద ట్రాజెడీ. క్లీన్‌గా ఉండే అథ్లెట్లు తమ హక్కులను కోల్పోయారు. ఇప్పటికే చాలా మంది రష్యాను వీడుతున్నారు. మరో దేశానికి వెళ్లి అక్కడ కెరీర్‌ను కొనసాగించే పనిలో ఉన్నారు. అథ్లెట్లపరంగా చూస్తే ఇదో హేయమైన చర్య. నాలుగేళ్ల బ్యాన్ అంటే స్పోర్ట్స్‌మన్ కెరీర్ సగానికి తగ్గినట్లే’ అని గనాస్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ అథ్లెట్లను న్యూట్రల్ ఫ్లాగ్ కింద ఆడిస్తామని రష్యాలోని కొన్ని స్పోర్ట్స్ ఫెడరేషన్స్ వెల్లడించాయి.
