ఇరాన్ సూసైడ్ డ్రోన్లతో రష్యా దాడి

ఇరాన్ సూసైడ్ డ్రోన్లతో రష్యా దాడి

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సోమవారం తెల్లవారుజామునే ఈ నగరంపై ఇరాన్  సూసైడ్ డ్రోన్లతో  రష్యా దాడి చేసింది. డ్రోన్ దాడిలో పలు బిల్డింగులు ధ్వంసమయ్యాయి. ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఒక డ్రోన్ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లోకి దూసుకురావడంతో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఓ గర్భిణీ ఉంది. పొద్దుపొద్దునే ఊహించని విధంగా ఆకాశంలో డ్రోన్లు తిరుగుతూ దాడులు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణరక్షణ కోసం షెల్టర్ల కింద దాక్కోవడానికి పరుగులు తీశారు. ఈ అటాక్ లో రష్యా 28 డ్రోన్లు ప్రయోగించిందని, పలు అపార్ట్ మెంట్లు ధ్వంసమయ్యాయని కీవ్ సిటీ మేయర్ క్లిట్స్ చోకో తెలిపారు. దాడిలో ధ్వంసమైన ఓ బిల్డింగ్ శకలాల నుంచి 18 మందిని కాపాడామని, మృతదేహాలను కూడా బయటకు తీశామని ఆయన చెప్పారు. శకలాల్లో సహాయక బృందాలు వెతుకుతున్నాయని వెల్లడించారు. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువగా దాడులకు గురైంది కీవ్ నగరమే. ఇప్పటి వరకు మిసైళ్లతో విరుచుకుపడిన రష్యా.. తాజాగా చేసిన దాడుల్లో ఇరానియన్ షాహిద్ డ్రోన్లను వాడింది. ఇవి చాలా ఎత్తులో నుంచి వచ్చి టార్గెట్ ను అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఓ డ్రోన్ ను అసోసియేటెడ్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. ఆ డ్రోన్ కు త్రిభుజాకారంలో ఉన్న రెక్క, పాయింటెడ్ వార్ హెడ్ ఉన్నాయి. పలు దిశల నుంచి డ్రోన్లు వచ్చి అటాక్ చేశాయని అధికారులు తెలిపారు. అవి ఇరాన్ షాహిద్ డ్రోన్లే అని కన్ఫర్మ్ చేశారు. 13 డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు. 

వెస్టర్న్ యూరప్​లో నాటో న్యూక్లియర్ డ్రిల్

వెస్టర్న్ యూరప్​లో నాటో న్యూక్లియర్ డ్రిల్స్ నిర్వహించింది. అయితే, ఇవి రొటీన్ గా నిర్వహించే సైనిక విన్యాసాలే అని, ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణకు ఈ డ్రిల్స్ తో సంబంధం లేదని నాటో తెలిపింది.