ఉక్రెయిన్‎పై రష్యా భీకర దాడి.. 37 మంది మృతి.. 50 ఇండ్లు దగ్ధం

ఉక్రెయిన్‎పై రష్యా భీకర దాడి.. 37 మంది మృతి.. 50 ఇండ్లు దగ్ధం

కీవ్‌‌‌‌‌‌‌‌: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌‌‌‌‌పై రష్యా శనివారం భీకర వైమానిక దాడులకు పాల్పడింది. బుచా జిల్లాలో జరిగిన ఈ దాడుల్లో 37 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాంబు దాడి తీవ్రత కారణంగా ఎగిసిపడ్డ మంటలు చుట్టుపక్కల ఇండ్లకు వ్యాపించాయి. దీంతో సుమారు 50 ఇండ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దాడుల ప్రభావంతో కీవ్ నగరంలో జనజీవనం, ఆర్థిక కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారాయి. 

నిరంతర వైమానిక హెచ్చరికలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం.. దెబ్బతిన్న భవనాల నుంచి బాధితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల కీవ్‌‌‌‌‌‌‌‌లో విద్యుత్, ఇతర సౌకర్యాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

గత మూడు రోజులుగా కీవ్‌‌‌‌‌‌‌‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అయితే, శనివారం జరిగిన దాడి ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లో ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా నిలిచింది. రష్యా ప్రయోగించిన క్షిపణులు, బాంబులతో బుచా జిల్లా దద్దరిల్లింది. మరోవైపు, దక్షిణ ఖేర్సన్ ప్రాంతంలో కూడా రష్యా జరిపిన దాడుల్లో ఇద్దరు మరణించారు.

రూల్స్ ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టం

కీవ్‌‌‌‌‌‌‌‌పై రష్యా జరిపిన భీకర వైమానిక దాడి, భారీ ప్రాణనష్టంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ ఓ ప్రకటనలో స్పందించారు. దాడి వల్ల బుచా జిల్లాలోని మైలా గ్రామంలో ఉన్న ఓ గోదాము(ఆయుధాల నిల్వ)లో భారీ పేలుడు సంభవించిందని వెల్లడించారు. పౌరుల నివాసాల మధ్య, ముఖ్యంగా ఇళ్ల సమీపంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. 

ఈ ఘటనలో వృద్ధులు, వికలాంగుల సంరక్షణ కేంద్రంతో పాటు పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, నిబంధనల ఉల్లంఘనకు అనుమతించిన తమ దేశ అధికారులపై ఇప్పటికే క్రిమినల్ విచారణ ప్రారంభించామని చెప్పారు. 

తప్పు చేసిన వారిని వదలబోమని.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ పేర్కొన్నారు. కాగా..బలాంగ్-రేంజ్ డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు, లాంచ్ బూస్టర్‌‌‌‌‌‌‌‌లను నిల్వ ఉంచిన మైలా గ్రామంలోని ఒక గోడౌన్​పై దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.