
- 598 డ్రోన్లను ప్రయోగించిన రష్యన్ ఆర్మీ
- ఖండించిన యూరోపియన్ దేశాలు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని కీవ్పై గురువారం తెల్లవారుజామున బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో భీకర దాడి చేసింది. మొత్తం 598 డ్రోన్లతో అటాక్ చేసింది. ఈ దాడిలో 17 మంది చనిపోగా.. 48 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. కీవ్ ప్రాంతంలో 7 జిల్లాల్లోని 20 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 100 భవనాలు ధ్వంసమయ్యాయి.
వాటిలో షాపింగ్ మాల్స్, నివాస ప్రాంతాలు ఉన్నాయి. అలాగే రాజధాని వ్యాప్తంగా వేల కిటికీలు బాంబుల ధాటికి పగిలిపోయాయి. పౌరులు రోజంతా కిటికీలు, ఇండ్ల శకలాలను క్లియర్ చేస్తూ ఉండిపోయారు. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ఓ వైపు అమెరికా ఆధ్వర్యంలో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో రష్యా ఈ స్థాయిలో దాడి చేసింది.
రష్యా ఆర్మీ 598 డ్రోన్లు, 31 మిసైళ్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా దాడిని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలెన్ స్కీ ‘ఎక్స్’ లో ఖండించారు. ‘‘ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం పిలుపునిచ్చిన దేశాలు తాజా దాడిపై స్పందించాలని మేము కోరుతున్నాం” అని జెలెన్ స్కీ అన్నారు.
ఈయూ, బ్రిటిష్ కౌన్సిల్ భవనాలు ధ్వంసం
రష్యా చేసిన దాడిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధుల బిల్డింగ్ తో పాటు బ్రిటిష్ కౌన్సిల్ భవనం కూడా ధ్వంసమయ్యాయి. అయితే, ఈ అటాక్ లో తమ డెలిగేషన్ సిబ్బంది ఎవరూ గాయపడలేదని ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయెన్ ‘ఎక్స్’ లో తెలిపారు. రష్యా ఇప్పటికైనా దాడులు చేయడం ఆపి, శాంతి చర్చలు జరపాలని ఆమె కోరారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను ఉర్సులాతో పాటు పలు దేశాల అధినేతలు ఖండించారు.
‘‘సివిలియన్ ఏరియాల్లో రష్యా చేసిన దాడుల్లో ఈయూ బిల్డింగ్ కూడా డ్యామేజ్ అయింది. రష్యా దాడులను నేను పూర్తిగా ఖండిస్తున్నా. రష్యా శాంతిని వదిలి టెర్రరిజాన్ని కోరుకుంటోందని తాజాగా చేసిన భీకర దాడులే నిదర్శనం” అని ఈయూ కమిషనర్ మార్తా కోస్ పేర్కొన్నారు. రష్యా దాడులతో తాను హడలెత్తిపోయానని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా అన్నారు. రష్యా దాడులకు ఈయూ ఏమాత్రం భయపడదన్నారు. ఉక్రెయిన్ కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా రష్యా దాడులను ఖండించారు.
102 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాం
తాజా దాడులపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్ కూడా తమ దేశంపై బుధవారం రాత్రంతా 102 డ్రోన్లను ప్రయోగించిందని, వాటిని కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక తాము అనుకున్న ప్రాంతాలపైనే దాడి చేశామని చెప్పారు. అటాక్ లో హైపర్ సోనిక్ ‘కింఝల్’ మిసైల్, డ్రోన్లు వాడామని తెలిపారు. ఉక్రెయిన్ మిలిటరీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ ఫీల్డ్స్ ను లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించారు.