సెంట్రల్ ​ఉక్రెయిన్​స్పై రష్యా భీకర దాడులు

సెంట్రల్ ​ఉక్రెయిన్​స్పై రష్యా భీకర దాడులు

కీవ్: ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సెంట్రల్​ఉక్రెయిన్​స్పై  రష్యా మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 17 మంది చనిపోయారని, 90 మందికిపైగా గాయపడ్డారని ఉక్రెయిన్​అధికారులు తెలిపారు.  క్యాపిటల్​ సిటీ కీవ్​ కు నైరుతిలో 268 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నిట్​సియాలో మూడు మిస్సైళ్లు ఓ ఆఫీస్​బిల్డింగ్​ ను  ఢీకొట్టాయని, ఆ దాడుల ప్రభావానికి చుట్టుపక్కల నివాస భవనాలు కూడా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. మిస్సైళ్ల దాడుల వల్ల భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని, 50 కార్లు కాలిపోయాయని చెప్పారు. అయితే తమ దేశ ఎయిర్​డిఫెన్స్​ సిస్టమ్ లు నాలుగు రష్యా మిస్సైళను ధ్వంసం చేశాయని తెలిపారు. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్​ ప్రెసిడెంట్​ వోలోదిమిర్ ​​జెలెన్​స్కీ ఖండించారు. మిలిటరీ నీతి పాటించకుండా తమ పౌరులపై రష్యా దాడులు చేస్తోందని, ఇది టెర్రరిజమేనని ఆయన ఆరోపించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉందని, తమ పౌరులను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేస్తోందని జెలెన్​స్కీ మండిపడ్డారు. ‘‘రష్యా ప్రతిరోజూ మా పౌరులను చంపుతోంది. దాడుల్లో పిల్లలు కూడా చనిపోతున్నారు. మిలిటరీ టార్గెట్లు లేని చోట మిస్సైళ్లతో దాడులు చేయడం టెర్రరిజం కాకపోతే మరేమవుతుంది” అని జెలెన్​​స్కీ ఆవేదన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్​లో రష్యా దాడులు, యుద్ధ నేరాలపై దర్యాప్తు చేసేందుకు ద హేగ్​లో40 దేశాల ప్రతినిధులు భేటీ అయినప్పుడే రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడింది.