సాతాన్‌కు నరబలి.. రష్యన్‌ జంట అరెస్ట్

సాతాన్‌కు నరబలి.. రష్యన్‌ జంట అరెస్ట్

క్షుద్ర పూజలే ఆ ఇద్దరిని కలిపాయి. క్షుద్ర దేవతలు ఉన్నారని, వాళ్లకు పూజలు చేస్తే అతీత శక్తులు వస్తాయని మూఢ నమ్మకాలు ఉన్న ఆ ఇద్దరూ అనుకోకుండా కలిశారు. మనసులు, ఆలోచనలు కలిశాయని ఒక్కటయ్యారు. ఇక ఇద్దరూ కలిసి క్షుద్ర పూజుల చేయడం మొదలుపెట్టారు. తమ రాక్షస పూజల కోసం ఇద్దరిని బలి కూడా ఇచ్చారు. రష్యాకు చెందిన ఈ జంట ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడడంతో వారి అరాచకాల చిట్టా బయటపడింది. 

రష్యా రాజధాని మాస్కోలో ఓల్గా బోల్షకోవా, అందేరీ ట్రెగుబెన్కో అనే ఇద్దరిని రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు మర్డర్ కేసులకు సంబంధించి వాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఇంటరాగేట్ చేయగా షాకింగ్ విషయాలు చెప్పారు. సాతాన్‌ను పూజించి, నర బలి ఇస్తే మానవాతీత శక్తులు వస్తాయని అందుకే ఒక మహిళను, ఒక యువకుడిని అడవుల్లోకి తీసుకెళ్లి నరికి చంపామని పోలీసులకు చెప్పారు. ఈ పూజలు ఎలా చేయాలి? పూజల ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాలపై రీసెర్చ్ చేస్తూ తామిద్దరం కలిశామని వివరించారు. ఇద్దరు ఆలోచనలు కలవడంతో జంటగా ఈ పనులు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తమ కలలను నిజం చేసుకోవడానికి ఇద్దరిని బలి ఇచ్చామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సహా పలు ఆధారాల సాయంతో వీరిద్దరినీ ఈ నెల మొదటి వారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీళ్లు డబ్బుల కోసం డ్రగ్స్ బిజినెస్‌ కూడా చేసేవాళ్లని, అరెస్ట్ చేసిన సమయంలో వాళ్ల ఇంట్లో భారీగా డ్రగ్స్ సీజ్ చేశామని రష్యన్ పోలీసులు తెలిపారు.