
కీవ్: ఉక్రెయిన్ లోని ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్లతో దాడి చేయడంతో తొమ్మిది మంది చనిపోయారు. నలుగురు గాయపడ్డారు. ఈశాన్య ఉక్రెయిన్ లోని సుమీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను ఉక్రెయిన్ పోలీసులు విడుదల చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మొదటిసారి శాంతి చర్చలు ముగిసిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ దాడిపై రష్యా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. సుమీ రీజినల్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం టెలిగ్రాం మెసేజింగ్ యాప్ లో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఇది రష్యా చేసిన మరో యుద్ధ నేరం. పౌర రవాణాపై ఉద్దేశపూర్వక దాడి” అని తెలిపింది.
ఫలించని కాల్పుల విరమణ చర్చలు
రష్యన్, ఉక్రెయిన్ అధికారులు శుక్రవారం (May 16) తుర్కియేలో తాత్కాలిక కాల్పుల విరమణ కోసం చర్చలు జరిపారు. కానీ, రెండు గంటల కంటే తక్కువ సమయంలోనే ఈ చర్చలు ఫలితం లేకుండా ముగిశాయి. రెండు దేశాలు1000 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడానికి అంగీకరించాయి. కాల్పుల విరమణకు సంబంధించిన కీలక షరతులపై మాత్రం అవి అంగీకారానికి రాలేకపోయాయి.