IND vs NZ: సెంచరీ చేసినా పక్కన పెట్టారు.. గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే!

IND vs NZ: సెంచరీ చేసినా పక్కన పెట్టారు.. గైక్వాడ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే!

టీమిండియాలో ఎంత బాగా ఆడినా కొన్నిసార్లు వేటు తప్పదు. కొంతమంది సెంచరీలు చేసినా జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితి. ఒక ఆటగాడు సెంచరీతో సత్తా చాటితే తర్వాత సిరీస్ కు ప్లేయింగ్ 11 లో ఖచ్చితంగా ఉంటాడు. కనీసం 15 మంది స్క్వాడ్ లో అయినా ఉంటాడు. కానీ టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ పరిస్థితి దారుణం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో గైక్వాడ్ కు చోటు దక్కలేదు. తాను ఆడిన చివరి సిరీస్ లో సెంచరీతో సత్తా చాటినా 15 మంది స్క్వాడ్ లో రుతురాజ్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఇందుకు కారణమేంటో చూద్దాం.. 

శ్రేయాస్ అయ్యర్ రీ ఎంట్రీ తో గైక్వాడ్ కు దక్కని చోటు:

స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో గైక్వాడ్ ను ఎంపిక చేశారు. గైక్వాడ్ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. సౌతాఫ్రికాపై రెండో వన్డేలో సెంచరీతో దుమ్ములేపాడు. 2025, డిసెంబర్ 3న రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని జట్టుకు భారీ అందించాడు. గైక్వాడ్ వన్డే కెరీర్ లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 34 ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

తొలి వన్డేలో 8 పరుగులే చేసి నిరాశపరిచిన గైక్వాడ్ రెండో వన్డేలో అద్భుతంగా రాణించాడు. మూడో వన్డేలో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.  వైస్ కెప్టెన్ గా అయ్యర్ గాయం నుంచి కోలుకొని భారత జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో గైక్వాడ్ కు పక్కన పెట్టక తప్పలేదు. ప్రస్తుతం భారత జట్టు మిడిల్ ఆర్డర్ లో బ్యాకప్ బ్యాటర్ అవసరం లేదని సెలక్టర్లు భావించారు. ఈ కారణంగానే అయ్యర్ ఎంట్రీతో గైక్వాడ్ పై వేటు పడింది. గైక్వాడ్ స్థానంలో అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. 

న్యూజిలాండ్ తో సిరీస్ కు భారత వన్డే జట్టు :

శుభమాన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్  సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్