
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫేక్ ఓటర్లు నమోదు చేశారంటూ పలు పార్టీల నేతల ఆరోపణలతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పందించారు. 8-3-231/బి/160 ఇంటి నంబర్ పై 43 మంది ఓటర్లు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఒకే నంబర్ పై ఎక్కువగా ఓటర్లు ఉన్న దానిపై కూడా విచారణ చేయించారు. యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్ బీ-బ్లాక్‌లో బూత్ నంబర్ 246 లోని ఓటరు జాబితా ప్రకారం 8-3-231/బి/160 నంబర్‌తో సంస్కృతి అవెన్యూ అనే అపార్ట్ మెంట్ ఉంది.
ఇందులో 15 ఫ్లాట్లు ఉండగా 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఓట్లు ఈ 15 ఫ్లాట్లకి చెందినవిగా గుర్తించారు. అలాగే 8-3-231/బి/118 నంబర్ తో 50 మంది ఓటర్లు, 8-3-231/బి/119 నెంబర్ తో 10 మంది ఓటర్లు, 8-3-231/బి/164 నంబర్ తో 8 మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు. కాగా, ఈ ఓట్లన్నీ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఓటర్లుగా ఉన్నవాళ్లేనని తేల్చారు. వీళ్లంతా 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని క్లారిటీ ఇచ్చారు. తాము కొత్తగా ఎవరి పేర్లనూ యాడ్ చేయలేదని స్పష్టం చేయడంతో పాటు ఈ ఆరోపణలను ఖండించారు.