ర్యాన్​ : ది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌‌‌‌

 ర్యాన్​ : ది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌‌‌‌

 పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు, సెలబ్రిటీల నుంచి స్పోర్ట్స్ పర్సన్స్‌‌ వరకు... ఇలా ఎంతోమంది ర్యాన్ ఫెర్నాండో చెప్పిందే తింటారు.ఇండియాలోనే టాప్‌‌ న్యూట్రిషనిస్ట్‌‌ల్లో ఒకడు ర్యాన్​.అంతేకాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఏం తినాలి? ఏం తినకూడదు? ఎప్పుడు తినాలి?ఎంత తినాలి? వంటి అన్ని విషయాలపై యూట్యూబ్‌‌లో వీడియోలు చేస్తూ జనాలకు అవగాహన కల్పిస్తున్నాడు. 

ఇండియాలోనే ఫేమస్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండో. ఈయనది బెంగళూరు. కానీ.. దేశమంతా క్లయింట్స్ ఉన్నారు. అందుకే ఇండియాలో హెల్త్‌‌, న్యూట్రిషన్ అనే సబ్జెక్ట్స్​ మాట్లాడుతుంటే ర్యాన్​ గుర్తొస్తాడు. అంతలా ఫేమస్ అయ్యాడు ర్యాన్‌‌. దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, బాలీవుడ్ స్టార్స్‌‌తోపాటు సామాన్యులకు ఏం తినాలో, ఏం తినకూడదో చెప్తూ ఆరోగ్యాన్ని పంచుతున్నాడు.

 ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీల సక్సెస్‌‌కు కారణం అవుతున్నాడు కూడా. ర్యాన్ ఫెర్నాండో దాదాపు ఇరవై ఏండ్లుగా న్యూట్రిషన్ సైన్స్‌‌ మీద రీసెర్చ్​ చేస్తున్నాడు. తన క్లయింట్స్‌‌ కోసం తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గే, స్ట్రెంత్‌‌ పెంచే డైట్​ వెరైటీలు తయారు చేస్తున్నాడు. అందుకే అమీర్ ఖాన్, విరాట్ కోహ్లీ, కాజల్ అగర్వాల్, అభిషేక్ బచ్చన్ లాంటి సెలబ్రిటీలు అతని క్లయింట్స్ అయ్యారు. 

యూట్యూబ్‌‌లోకి...

ర్యాన్ ఫెర్నాండో 2013లో యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ మొదలు పెట్టాడు. ఐదారేండ్ల నుంచి రెగ్యులర్‌‌‌‌గా వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేస్తున్నాడు. ఇండియన్స్ తినే విధానాన్ని మెరుగుపరచడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు. ఈయన ఛానెల్‌‌కు 4.31 లక్షల మంది సబ్‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 538 వీడియోలు అప్‌‌లోడ్‌‌ చేశాడు. ఈ ఛానెల్‌‌ ద్వారా జనాలకు తెలియని ఎన్నో న్యూట్రిషన్ సీక్రెట్స్‌‌ చెప్పాడు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఫుడ్‌‌ ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎవరికి ఏ ఫుడ్ సరైంది? శారీరక ఆరోగ్యం కోసం ఏం తినాలి?.. ఇలాంటి ఎన్నో విషయాలపై అవేర్​నెస్​ కల్పిస్తున్నాడు. 

ర్యాన్‌‌ ‘క్వా’(Qua) న్యూట్రిషన్ పేరుతో క్లినిక్స్‌‌ నడుపుతున్నాడు. వీటి ద్వారా ‘న్యూట్రిషన్’ని సామాన్య ప్రజలకు అందించాలి అనుకుంటున్నాడు. ‘క్వా’ అంటే.. లాటిన్‌‌లో ‘‘ఇన్ కెపాసిటీ ఆఫ్‌‌” అని అర్థం. పదమూడేండ్ల క్రితం ఒక గదిలో ఒక డైటీషియన్‌‌తో ఈ క్లినిక్ మొదలైంది. కానీ.. ఇప్పుడు  అనేక నగరాల్లో 50 కంటే ఎక్కువ క్లినిక్స్‌‌ ఉన్నాయి. అంతేకాదు.. ఇ–క్లినిక్ మోడల్‌‌తో గ్లోబల్‌‌గా సర్వీస్​లు ఇస్తున్నాడు. వీటిలో పనిచేసే ప్రతి డైటీషియన్‌‌కు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. కొందరికి సూపర్ స్పెషలైజేషన్ కూడా ఉంటుంది. 

బయో–ఇండివిడ్యువాలిటీ

ప్రతి వ్యక్తికి “బయో–ఇండివిడ్యువాలిటీ” ఉంటుంది. దాన్ని కనుగొనడంలో సాయపడేందుకు ఈ ‘క్వా’లు పనిచేస్తున్నాయి అంటాడు ర్యాన్‌‌. ప్రతి వ్యక్తి జెనెటిక్‌‌ ప్రి, కరెంట్ కండిషన్స్‌‌, బ్లడ్ కెమిస్ట్రీ, మైక్రోబయోమ్ ప్రొఫైల్, బాడీ మ్యాట్రిక్స్‌‌, ఫుడ్ కల్చర్‌‌‌‌, ఇష్టాయిష్టాలు, షెడ్యూలింగ్​ అనేవి చాలా ప్రత్యేకం. అందుకే ‘క్వా’లో ఒక వ్యక్తి ఎంపికలు, లక్ష్యాలు, కోరికల ప్రకారం ఫిట్‌‌నెస్, న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌‌ తయారు చేస్తారు. సెలబ్రిటీ లేదా సాధారణ వ్యక్తి ఎవరైనా సరే... వాళ్లకు సరిపోయే కచ్చితమైన డైట్‌‌ ప్లాన్‌‌ ఇస్తారు. 

ఇప్పటివరకు భారత మహిళల క్రికెట్ జట్టు, ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్‌‌ అథ్లెట్స్‌‌, ఇంటర్నేషనల్‌‌ మోడల్స్‌‌, సినిమా, టీవీ నటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతోపాటు ఎంతోమంది సామాన్యులకు సేవలు అందించాడు. ఆయన క్లయింట్స్‌‌లో ఇద్దరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్లు, ఇద్దరు ఒలింపిక్ పతక విజేతలు ఉన్నారు. రెజ్లర్ సుశీల్ కుమార్, క్రికెటర్లు రాబిన్ ఉతప్ప, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, గోల్ఫర్ షర్మిలా నికోలెట్.. ఇలా చెప్పుకుంటూ పెద్ద లిస్టే ఉంటుంది.

ప్రస్తుతానికి ర్యాన్‌‌ ఒక కన్సల్టేషన్‌‌కు 20,000 రూపాయలకు పైగానే తీసుకుంటున్నాడట. ‘ఇనిస్టిట్యూట్ న్యూట్రిషన్‌‌’ వెబ్​సైట్​లో న్యూట్రిషన్‌‌ కౌన్సెలింగ్ ప్లాన్స్‌‌, వాటి బడ్జెట్స్‌‌ తెలుసుకోవచ్చు. జెనెటిక్‌‌ టెస్టింగ్‌‌ కోసం రూ. 1,77,000 నుండి రూ. 2,95,000 వరకు ఖర్చవుతుంది. 

దంగల్

దంగల్ సినిమా కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఐకానిక్ ఫిజిక్‌‌ డెవలప్‌‌ చేయడం ర్యాన్‌‌ విజయాల్లో ఒకటి. ఈ సినిమాలో కొన్ని సీన్స్​లో బరువు పెరిగి, మరికొన్ని సీన్స్​లో బరువు తగ్గి కనిపిస్తాడు. ఇలా శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చడం చిన్న విషయమేమీ కాదు. కానీ.. దాన్ని కూడా సాధ్యం చేసి చూపించాడు ర్యాన్‌‌.