MS Dhoni Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని జట్లు సన్నాహాలు మొదలుపెట్టాయి. మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు తమ ఇష్టమైన ఆటగాళ్లను మైదానంలో చూడాలని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ కోసం భారీగా ఫ్యాన్స్ తరలిరానున్నారు. అయితే, ధోని హెల్త్ కి సంబంధించిన వార్త అభిమానులకు కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రాక్టీస్ సెషన్ అనంతరం ధోని కుంటుతూ నడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఫ్రాంచైజీ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, అతని ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2023 సీజన్ నుంచి ఎంఎస్ ధోని మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయినప్పటికీ ఇంకా క్రికెట్ ఆడుతూ, వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించడం విశేషం. 2023లో ఐపీఎల్ ఫైనల్ కి ముందు ముంబైలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించారు. కానీ ఈసారి ధోని కెప్టెన్‌గా ఉండడు.. ఇప్పటికే కెప్టెన్సీ బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్ కి అప్పగించారు. ఇక వికెట్ కీపింగ్ విషయంలో ధోని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా అనే సందేహం కలుగుతుంది.
కీపింగ్ చేసేది సంజు శాంసన్?:
ఎంఎస్ ధోని ఫిట్‌గా లేకపోతే, సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ ద్వారా చెన్నై జట్టులో చేరిన అతడు, ఇప్పటికే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కలిగి ఉంది. ప్రస్తుతం సంజు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్‌పై 97 నాటౌట్, ఇంగ్లాండ్‌పై సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్‌పై ఫైనల్లో 89 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.
శాంసన్ కీలక వ్యాఖ్యలు:
సంజు శాంసన్ మాట్లాడుతూ: మాహీ భాయ్‌తో ఫోన్‌లో చాలాసార్లు మాట్లాడాను.. ఇండియా క్యాంప్‌లో కూడా చూశాను.. కానీ ఒకే జట్టులో కలిసి ఆడటం ఇదే మొదటిసారి.. ఆయనతో కలిసి ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను అని తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఇంకా టైటిల్ గెలవలేదు.. ఈ సీజన్‌లో మంచి ఫలితాలు సాధించాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.. ధోని ఫిట్‌నెస్ పరిస్థితి ఈ జట్టు ప్రదర్శనపై ఎంత మేర ప్రభావం చూపుతుందో అనేది వేచి చూడాలి.
