
10 ఎకరాల పరిమితి పెట్టే యోచన
85 శాతం రైతులు పదెకరాల లోపు వాళ్లే
అనధికారికంగా ఈ ఏడాది ఖరీఫ్ నుంచే అమలు!
రూ. 7,254.33 కోట్లకు రూ. 5,100 కోట్లకే అనుమతులు
హైదరాబాద్, వెలుగు: రైతు బంధు స్కీమ్‌కు సీలింగ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఖరీఫ్‌లో ప్రారంభమైన ఈ స్కీమ్ కింద ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం అందించడంతో ఖజానాపై పెద్ద ఎత్తున భారంపడింది. దీనికి ఆర్థికమాంద్యం తోడవడంతో ప్రభుత్వాన్ని నిధుల కొరత వెంటాడుతోంది. రైతుబంధుకు కిందటేడాది రెండు సీజన్లు కలిపి రూ.10,501కోట్లు, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రూ.5,456 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇవన్నీ కలిపి ఇప్పటికే రూ.15,957కోట్లు అయింది. ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తుండడంతో స్కీమ్ భారాన్ని కొంత తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో 85 శాతానికి పైగా రైతులకు పదెకరాల లోపే భూమి ఉంది.
ప్రతి సీజన్లో కోత..
రెండేళ్లుగా అమలు చేస్తున్న రైతుబంధులో ప్రభుత్వం ప్రతి సీజన్‌లో కోతే పెడుతోంది. దీంతో ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచినా కేటాయిస్తున్న నిధులు, సాయం అందించాల్సిన రైతుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. 2018లో ఖరీఫ్ లో రూ.5,257 కోట్లు ఇస్తే.. 2018 రబీలో రూ.5,244 కోట్లు ఇచ్చింది. కిందటేడు 14 లక్షల మందికి కోత పెట్టగా ఈ ఏడాది ఖరీఫ్‌లో కూడా 8 లక్షల మందికి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అందలేదు.
వీరు సాగు చేసే భూమే 80 శాతం వరకు ఉంటోంది. ఈ నేపథ్యంలో 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. సీలింగ్ పెడితే వెయ్యి కోట్ల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉందని.. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి కూడా పదెకరాల వరకు సాయం అందిస్తే దాదాపు ఏడు వందల కోట్లు మిగిలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనికి సీఎం అంగీకరించలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇదివరకే చెప్పారు. అయితే మారిన పరిస్థితులతో రూల్స్ మార్చేందుకు సీఎం కూడా అంగీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రైతుబంధు నిధులు రూ.6862.50 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చినా రూ.5100 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. దీంతో స్కీమ్‌కు పరిమితులు తప్పవని తెలుస్తోంది.
రూ.1,511 కోట్లపై స్పందన లేదు
2019 ఖరీఫ్‌లో మొత్తం 56 .76 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున 1.45 కోట్ల ఎకరాలకు రూ.7,254 .33 కోట్లు సాయం చేయాల్సి ఉంది. అయితే 52.94 లక్షల మంది రైతుల బ్యాంకుల వివరాలు మాత్రమే సేకరించారు. వీరికి 1.39 కోట్ల ఎకరాల భూమి ఉండగా రూ . 6,967 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 44.92 లక్షల మంది రైతులకు 1.09 కోట్ల ఎకరాలకు రూ. 5,456 కోట్లు మాత్రమే సాయం అందించింది. ఈ 44.92 లక్షల మంది రైతులంతా దాదాపు 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారే. పెండింగ్‌లో ఉన్న రూ.1,511 కోట్ల నిధులపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం చూస్తుంటే ఈ ఏడాది ఖరీఫ్ నుంచే అనధికారికంగా పదెకరాల స్లాబ్ అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
కేటగిరీ రైతులు దున్నే భూమి రైతులు భూమి
(ఎకరాల్లో) (ఎకరాల్లో) (శాతం) (శాతం)
2.5 లోపు 34.10 లక్షలు 38.71 లక్షలు 60 25
2.5 – 5 13.27లక్షలు 46.19 లక్షలు 24 30
5 – 10 6.02 లక్షలు 39.16 లక్షలు 11 26
10 – 25 1.66 లక్షలు 22.90 లక్షలు 3 15
25కు పైగా 15 వేలు 6.14 లక్షలు 0.3 4
see also:ప్రలోభ పెడుతున్నాడంటూ TRS నాయకుడిని అడ్డుకున్న ఓటర్లు