- ఎన్జీఆర్ఐ నేతృత్వంలో హెలికాప్టర్ ద్వారా నిర్వహణ
- నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్
- భూమి లోపలి షియర్ జోన్లను గుర్తించేందుకు వీలుగా స్టడీ
- దాదాపు 200 కి.మీ. పరిధిలో సర్వే చేయనున్న ఇరిగేషన్ శాఖ
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. సోమవారం నుంచి ఎస్ఎల్బీసీ పనుల కోసం హెలికాప్టర్ ఆధారిత జియోమాగ్నటిక్ సర్వేను నిర్వహించనుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 43.93 కిలోమీటర్ల టన్నెల్లో భాగంగా ఇప్పటికే శ్రీశైలం ఇన్లెట్ నుంచి 13.94 కిలోమీటర్లు, ఔట్లెట్ (దేవరకొండ) నుంచి 20.4 కిలోమీటర్ల మేర తవ్వారు.
మరో 9.8 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 22న అనుకోని ప్రమాదంతో 8 మంది సిబ్బంది చనిపోయారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర వరద నిండింది. అప్పట్నుంచి పనులు జరగడం లేదు. టన్నెల్లో డొల్లలాగా మారడంతో టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)తో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో టీబీఎంతో కాకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో టన్నెల్‌ను తవ్వాలని నిర్ణయించారు.
అందుకు తగ్గట్టు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో హెలికాప్టర్ ద్వారా జియోమాగ్నటిక్ సర్వే చేయించనున్నారు. సర్వేలో భాగంగా మొత్తం 200 కి.మీ మేర హెలికాప్టర్‌తో సర్వే చేస్తారు. 24 మీటర్ల వ్యాసం కలిగిన మాగ్నటిక్ లూప్‌తో భూమిలోపల ఏముందో తెలుసుకుంటారు. ఈ లూప్ ద్వారా భూమిలోకి ఎలక్ట్రో మాగ్నటిక్ సిగ్నల్స్‌ను పంపించి.. భూమికి 800 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకున్న లోపలి పొరల్లోని లోపాలకు సంబంధించి నమోదయ్యే రీడింగ్స్‌ను నమోదు చేస్తారు. వాటి ఆధారంగా షియర్ జోన్ ప్రాంతాలు ఎక్కడున్నాయో అంచనా వేస్తారు. దాని ప్రకారమే టన్నెల్ తవ్వకం పనులను ముందుకు తీసుకెళ్తారు.
ఆడిట్లను కట్టేందుకూ అనుకూలించని ప్రాంతం
టన్నెల్‌ను రిజర్వ్ ఫారెస్ట్ నుంచి తవ్వాల్సి రావడంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. క్వార్ట్జ్ స్టోన్, భారీ బండలను తవ్వుకుంటూ టన్నెల్‌ను నిర్మించాల్సి ఉంది. 15 నాలాలు (చిన్న చిన్న ప్రవాహాలు), నాలుగు వాగుల గుండా టన్నెల్ వెళ్తున్నది. అడవులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల సైడ్ యాక్సెస్ షాఫ్ట్‌లు, ఆడిట్లను నిర్మించేందుకూ అనువుగా లేదు. దీంతో రెండు వైపులా టీబీఎం ద్వారా పనులు చేశారు.
ఇప్పుడు అనుకోని ప్రమాదంతో టన్నెల్ లోపలే టీబీఎం కూరుకుపోవడంతో.. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో టన్నెల్‌ను తవ్వనున్నారు. 2009లో వచ్చిన వరదలతో టన్నెల్ పనులు ఆగిపోగా.. ఇప్పటి వరకు నెలకు కేవలం 75 మీటర్ల చొప్పున తవ్వకాలే జరిగాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం 2028 జూన్‌లోపు టన్నెల్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇది పూర్తయితే.. ప్రపంచంలోనే అతి పొడవైన నీటిపారుదల సొరంగంగా రికార్డులకు ఎక్కనుంది.
కాగా, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు గౌరవ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ (ఇండియన్ ఆర్మీ మాజీ ఈఎన్సీ) హర్పాల్ సింగ్‌ను నియమించింది. టన్నెల్ స్పెషలిస్ట్ అయిన కల్నల్ పరీక్షిత్ మెహ్రాను స్పెషల్ అడ్వైజర్‌గా అపాయింట్ చేసింది. వాళ్ల ఆధ్వర్యంలో టన్నెల్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నది.
నేడు మన్నెవారిపల్లెకు సీఎం
నాగర్‌కర్నూల్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ జియోమాగ్నటిక్ సర్వేను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెవారిపల్లె ఎస్ఎల్బీసీ టన్నెల్ ఔట్లెట్ దగ్గర అధికారులతో ఆయన రివ్యూ నిర్వహిస్తారు. ఇందులో మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఈఎన్సీలు, సీఈలు, డీఎల్ఐ ఇంజనీర్లు పాల్గొననున్నారు.
