
నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని 2,98,472 మంది రైతులుండగా 2,12,172 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా కింద మంగళవారం రూ.160.72 కోట్లు జమయ్యాయని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాకు ప్రకటన రిలీజ్చేశారు. రెండెకరాల్లోపు రైతులు1,68,166 మందికి మొదటి రోజు రూ.95.66 కోట్లు జమ కాగా, రెండో రోజు మూడెకరాల్లోపు 44,006 రైతుల ఖాతాల్లో రూ.65.06 కోట్లు జమయ్యాయన్నారు.
మిగతా 86,300 మంది రైతులకు మరో రూ.165.31 కోట్లు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుందన్నారు. జిల్లాలోని రైతులందరికీ కలిపి రైతుభరోసా కింద రూ.326.03 కోట్లు అవసరమని సర్కార్‌కు నివేదించామన్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుందన్నారు. వానాకాలం సీజన్ పనులు షురూ కావడానికి ముందే డబ్బు చేతికందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఆయిల్ పామ్‌తో అధిక లాభాలు..
రైతులకు లాభం చేకూర్చే ఆయిల్‌పామ్ పంటను జిల్లాలో పెంచాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. సర్కార్ సబ్సిడీని వినియోగించుకోవాలన్నారు. పంట రేటు నిర్ణయించేందుకు బోర్డు ఉన్నందున ధీమాతో ఉండొచ్చని ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందవచ్చన్నారు.
కామారెడ్డి జిల్లాలో రూ. 169 కోట్లు జమ..
కామారెడ్డి, వెలుగు : రైతు భరోసా కింద కామారెడ్డి జిల్లాలో మంగళవారం వరకు 2,47,908 మంది రైతుల అకౌంట్లలో రూ.169 .48 కోట్లు జమయ్యాయి. బాన్సువాడ నియోజకవర్గంలో 27,537 మంది రైతుల అకౌంట్లలో రూ. 17.36 కోట్లు, జుక్కల్ లో 73,230 మంది రైతుల అకౌంట్లలో రూ.53.02 కోట్లు, ఎల్లారెడ్డిలో 87,777 మంది అకౌంట్లలో రూ.59 కోట్లు, కామారెడ్డిలో 59,364 మంది అకౌంట్లలో రూ.40.07 కోట్లు జమ అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు.