
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13 వరకు రైతు బీమా పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో రైతుకు రూ. 3,013.50 బీమా ప్రీమియంగా నిర్ణయించింది. ఇందుకు రూ.934.19 కోట్లను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది కంటే ప్రీమియం రూ.230 కోట్లు పెరిగిం ది. మొత్తం 31.10లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తిం చారు. గతేడాది రూ.2,271.50గా ఉన్న ప్రీమియంతో ఎల్‌ఐసీకి రూ.47.19 కోట్ల నష్టం రావడంతో ఈ ఏడాది ప్రీమియాన్ని రూ.3,013.50కు పెంచారు.
గత ఏడాది ఇలా..
గతేడాది ఆగస్టు 14 నుంచి రాష్ట్రం లోని 31.21లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు బీమా అమలు చేసిం ది. బీమా అమలు చేస్తున్న నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం లో వివిధ కారణాలతో 15,027 మంది రైతులు మృతి చెందారు. ప్రభుత్వం గతేడాది బీమా ప్రీమియం కింద ఎల్‌ఐసీకి రూ.704.16 కోట్లు చెల్లించింది. ఇప్పటి వరకు మృతిచెం దిన ఒక్కో రైతు కుటుంబానికి అయిదు లక్షల రూపాయల చొప్పున రూ.751.35 కోట్లు చెల్లించిం ది. ఆగస్టు13 నాటికి బీమా గడువు ముగియనుంది.